ఎప్పుడు ఎన్నికలు జరిగినా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటేనే సులువుగా విజయం సాధించవచ్చన్న నమ్మకంతో పార్టీలు పథకాలు రూపొందిస్తున్నాయి. నెలనెలా వారికి నేరుగా నగదు అందే విధానాలు ఆలోచిస్తున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషించగా ఆయా అభ్యర్థుల విజయాల వెనుక మహిళా ఓట్ల శాతమే కీలకమవుతోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్, బిజెపి మహిళా ఓటర్లకు వరాలు ప్రకటించడం ఊపందుకుంటోంది.అప్‌డేట్ చేసిన ఢిల్లీ ఓటర్ల జాబితా ప్రకారం ఢిల్లీలో మొత్తం నమోదైన 1,55,24,858 ఓటర్లలో పురుషులు 84,49,645 కాగా, మహిళా ఓటర్లు 71,73,952 మంది వరకు ఉన్నారు. కొద్దిగా సంఖ్య తగ్గినా దాదాపు పురుషుల ఓటర్లతో సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారు.
అంటే గెలుపును నిర్ణయించే స్థాయిలో మహిళా ఓటర్లు ఉండడం గమనార్హం. మహిళా ఓటర్లు ఎవరికి గుత్తగోలుగా ఓట్లు వేస్తే వారికే అఖండ విజయం దక్కుతుందన్నది నిర్వివాదాంశం. ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం మహిళలకు నెలనెలా రూ. 1000 వంతున నగదు పంపిణీ చేస్తోంది. రానున్న ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుత సాయాన్ని రూ. 2100 వరకు పెంచుతామని హామీ ఇస్తోంది. బిజెపి కూడా మహిళలకు తాము నెలనెలా రూ. 2500 వరకు నగదు పంపిణీ చేయడానికి సిద్ధపడుతోంది. కానీ ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్ సోమవారం నాడు (6.1.2025) మహిళలకు నెలనెలా రూ. 2500 వంతున ప్యారీ దీదీ యోజన పథకం కింద పంపిణీ చేస్తామని వెల్లడించింది. అయితే మహిళలకు నగదు పంపిణీ అన్నది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. గత ఎన్నికల సమయాల్లోనూ మహిళలకు ఆయా పార్టీలు నగదు పంపిణీ పథకాలను ప్రకటించాయి. ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో మహాయుతి, జెఎంఎం విజయానికి ఎన్నికల్లో ట్రంప్ కార్డ్‌గా మహిళల కేంద్రీకృత నగదు పథకాలు కీలకమయ్యాయి.
దాంతో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు నేరుగా నగదు బదిలీతో మహిళలను ఆకర్షించే కళను నేర్చుకున్నాయి. ఇంకా గతంలోకి వెళ్లి చూస్తే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ 2021లో పశ్చిమ బెంగాల్‌లో లక్ష్మీర్ భండార్ పథకాన్ని ప్రారంభించింది. ఎస్‌సి/ఎస్‌టి కమ్యూనిటీకి చెందిన మహిళలకు నెలవారీ భత్యం రూ. 1200, మరి ఇతర వర్గాల మహిళలకు రూ. 1000 అందజేస్తామని ప్రకటించి విజయం సాధించింది. ఇప్పుడు అమలు చేస్తోంది. బిజెపి 2023లో మధ్యప్రదేశ్‌లో నెలకు రూ. 1250 ముఖ్యమంత్రి లడ్కీ బహన్ పథకాన్ని ప్రారంభించి భారీ మెజారిటీతో విజయం సాధించింది. 2024లో మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మాజి లడ్కీ బహిన్ యోజనగా రూ.1500 నగదు అందించింది. ఎన్నికల ముందు మహాయుతి కూటమి తాము అధికారం లోకి వస్తే దీన్ని రూ. 2100 కి పెంచుతామని హామీ ఇచ్చి గెలిచారు. ఒడిశాలోని బిజెపి ప్రభుత్వం సుభద్ర పథకం ద్వారా ఏటా రెండు విడతల్లో రూ.10,000 అందజేస్తోంది. అదే విధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వం లో సంకీర్ణ ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టులో తన ముఖ్యమంత్రి సమ్మాన్ యోజనను ప్రారంభించింది.
ప్రతి నెలా రూ.1000 అందిస్తోంది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెలా రూ. 2000 గృహలక్ష్మియోజన పథకం కింద అందజేస్తోంది. ఈ ఉచిత హామీలు ఓటింగ్ సరళిని ప్రభావితం చేయడాన్ని పరిశీలిస్తే… 2023 డిసెంబరులో ఎఎన్‌ఎస్‌బిఐ పరిశోధన అధ్యయనం ప్రకారం మధ్యప్రదేశ్‌లో లడ్కీ బెహనా పథకం వల్లనే అట్టడుగు మహిళల్లో ఒక శాతం ఓటింగ్ పెరిగిందని అంచనా. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీల ఎన్నికల్లో, మహిళల క్యూలు పురుషుల క్యూల కంటే, చాలా పొడుగుగా కనిపించడం విశేషం. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో 2024 మేలో ఎస్‌బిఐ రీసెర్చి నివేదిక ప్రకారం మహిళా ఓటర్ల సంఖ్య 84.7 లక్షల కంటే ఎక్కువగా 93.6 లక్షలకు చేరుకుంది. భారత రాజకీయాలకు కొత్త ‘సెంటర్ ఆఫ్ గ్రావిటీ’గా, ఉజ్వల యోజన, మాతృవందన యోజన, పిఎం ఆవాస్ యోజన, అనే మూడు మహిళా కేంద్ర పథకాలు ఉన్నాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, మహిళలకు నేరుగా నగదు బదిలీచేయడం వల్ల ఆయా రాష్ట్రాల్లో ఖజానాపై ఎంత భారం పడుతోందో వెల్లడైంది.
రాష్ట్రాల ఆదాయంలో 311 శాతం ఖర్చవుతుందని తేలింది. ఎనిమిది రాష్ట్రాలకు (కర్ణాటక, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఒడిశా) మొత్తం ఖర్చు రూ. 2.11 లక్షల కోటు కాగా, మహారాష్ట్ర తన లడ్కీ బహిన్ స్కీమ్ కోసం రూ. 46,000 కోట్లు కేటాయించింది. మధ్యప్రదేశ్‌లో లడ్కీ బెహనా పథకం అమలుకు 2025 ఆర్థిక సంవత్సరం కోసం రూ. 18,984 కోట్లు ఖర్చవుతాయని ముందుగానే ప్రతిపాదించారు. ఇది 2024లో కేటాయించిన రూ. 14,716 కోట్లతో పోలిస్తే 29% ఎక్కువ. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తన లక్ష్మీర్ భండార్ కోసం రూ. 14,400 కోట్లు కేటాయించింది. అంటే రాష్ట్ర ఆదాయం రూ. 2,36,251 కోట్లలో 6% దానికే వెచ్చిస్తోంది. కర్ణాటక గృహలక్ష్మిపథకానికి రూ.28,608 కోట్లు కేటాయించింది. ఇది 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వసూళ్లలో 11% వాటాను కలిగి ఉంటోంది. ప్రతి మహిళకు నెలకు రూ. 1000 ఇస్తున్న ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తన ఆదాయంలో ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనకు రూ. 2000 కోట్లు కేటాయించింది. ఇప్పుడు నెలనెలా రూ. 2100 వంతున మహిళలకు ఇవ్వడానికి నిర్ణయించడంతో ఒకవేళ గెలిస్తే రూ. 2000 కోట్ల కన్నా రెట్టింపు ఖర్చు చేయవలసి వస్తుంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఓట్ల కోసం ఉచిత హామీలపైనే పార్టీలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి.