Monday, December 23, 2024

సిగ్గు… సిగ్గు!

- Advertisement -
- Advertisement -

మహిళా రెజ్లర్లు (కుస్తీ ప్రవీణులు) ఢిల్లీ జంతర్ మంతర్‌లో రెండు రోజులుగా సాగిస్తున్న ధర్నా దేశం తలొంచుకొని సిగ్గు పడేలా చేస్తున్నది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్లుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి సీనియర్ ఎంపి, 66 ఏళ్ళ బ్రిజ్‌భూషణ్ తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని వెల్లడిస్తూ ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోవాలని, ఆ ఫెడరేషన్‌నే రద్దు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. బ్రిజ్‌భూషణ్ చేతిలో లైంగిక దుర్మార్గానికి గురయ్యామని 20 మంది ఆ ఉదంతాలు తనకు పూసగుచ్చారని ప్రఖ్యాత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ తెలియజేశారు. 28 ఏళ్ళ వినేశ్ కామన్‌వెల్త్ ఆటల్లో, ఆసియన్ గేమ్స్‌లో బంగారు పతకాలను సాధించుకొన్న మొట్టమొదటి మహిళా రెజ్లర్. కోచ్‌లు, బ్రిజ్‌భూషణ్ చేతిలో చాలా మంది మహిళా అథ్లెట్‌లు, రెజ్లర్లు లైంగిక మోసాలకు గురయ్యారని ప్రకటిస్తూ జంతర్ మంతర్ ధర్నాలో అనేక మంది పురుష, మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు.

అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం కేసు నిందితుడు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్ గంజ్ నియోజక వర్గం నుంచి ఎంపిగా వున్నాడు. ఐదుసార్లు బిజెపి తరపున, ఒకసారి సమాజ్‌వాది పార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఇంత సీనియర్ నాయకుడు తన కుమార్తెల వంటి మహిళా రెజ్లర్లపై ఇంత నీచమైన పనికి ఎలా పాల్పడగలిగాడు అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఆటల్లో పైకి రావాలనే ఆశయంతో వెళ్ళే అమ్మాయిల పట్ల కోచ్‌లు అనుచితంగా వ్యవహరించడం మామూలైపోయింది. కేవలం నేరస్థ మనస్తత్వం గలవారే ఇటువంటి దురాగతాలకు తెగించగలుగుతారు. గత చరిత్రలోకి వెళితే అనేక మంది బిజెపి పెద్దలు ఇటువంటి నేరాలకు పాల్పడిన ఉదంతాలు బయటపడతాయి. 2017 లో మధ్యప్రదేశ్‌కు చెందిన భోజ్‌పాల్ సింగ్ అనే బిజెపి నాయకుడు తన ఇద్దరు సహాయకులతో కలిసి ఒక దళిత స్త్రీపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైంది.

దారిద్య్రరేఖ దిగువనున్న వారికి ఇచ్చే రేషన్ కార్డును ఇప్పిస్తామనే ఆశ చూపించి వారు ఆ దారుణానికి తలపడినందుకు ఆ కేసు దాఖలైంది. యుపిలోని వున్నావ్‌లో ఒక బిజెపి ఎంఎల్‌ఎ రేప్‌కు పాల్పడ్డాడన్న ఉదంతంపై సిబిఐ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. జమ్మూలోని కథువా ఆలయంలో 8 ఏళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుడైన ఒక పోలీసు అధికారిని విడుదల చేయాలంటూ జరిగిన ఊరేగింపుకి బిజెపి నాయకుడు నాయకత్వం వహించడం అందరినీ ముక్కు మీద వేలు వేసుకొనేలా చేసింది. 22 ఏళ్ళ నర్సింగ్ విద్యార్థిని పై రేప్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణపై గుజరాత్‌లోని ఒక బిజెపి నాయకుడిపై కేసు దాఖలైంది. గుజరాత్‌లోనే 24 ఏళ్ళ మహిళపై సామూహిక అత్యాచారం జరిపిన పది మందిలో నలుగురు కచ్ జిల్లాకు చెందిన స్థానిక బిజెపి నేతలని వెల్లడైంది. ఇలా ఎంతో మంది బిజెపి నేతలు తుచ్ఛమైన లైంగిక దుర్మార్గాలకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఆధ్యాత్మిక, నైతిక సమాజాన్ని నెలకొల్పుతామని బిజెపి గొప్పలు చెప్పుకొంటుంది.

ప్రధాని మోడీ గాని, హోం మంత్రి అమిత్ షా గాని, ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు గాని ఈ అమానుషాలను గట్టిగా ఖండించకపోడం దేశంలోని మహిళలకు తగిన భరోసా కలిగేలా వీరికి కఠిన శిక్షలు పడేలా చూడకపోడం కళముందున్న కఠోర వాస్తవమే. సహజంగానే బ్రిజ్‌భూషణ్ తన మీద ఆరోపణలను పెద్ద గొంతుకతో ఖండిస్తున్నాడు. అతని చేతిలో అన్యాయమైపోయిన అభాగినులు పేద వర్గాలకు చెందిన వారు కావడం వల్ల పరువుకి భయపడి తమకు జరిగిన విషాదాన్ని లోలోపలే భరిస్తున్నారు. వినేశ్ ఫొగట్ ధైర్యం చేసి ఈ దారుణాలను బయటపెట్టి జంతర్ మంతర్‌లో ధర్నాకు అందరినీ కూడగట్టడం ప్రశంసించదగిన సాహసం. ధర్నాలోని మహిళా రెజ్లర్స్‌ను కలిసి వారి పట్ల సానుభూతి వ్యక్తం చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలీవాల్‌ను బుధవారం తెల్లవారు జామున గం. 3.15 సమయంలో ఒక తాగుబోతు తన కారు ఎక్కమని బలవంతం చేయడం అందుకు నిరాకరించి అతడిని కారులోంచి బయటకు లాగే ప్రయత్నం చేసిన ఆమె చేతిని కారు అద్దంలో ఇరికించి 15 మీ. దూరం లాక్కెళ్లడం ఎంత ఆందోళనకరమైన ఘటనో చెప్పనక్కర లేదు.

స్వాతి మాలీవాల్‌ను ఢిల్లీ ఆప్ ప్రభుత్వం మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా నియమించింది. ఢిల్లీలో స్త్రీలకు గల భద్రత గురించి తెలుసుకోడానికి ఆమె నగర పర్యటన చేస్తుండగా ఆ దుర్మార్గుడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీ పోలీసు విభాగం కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ ఆధీనంలో వుంటుంది కాబట్టి స్వాతి మాలీవాల్‌కు తగిన రక్షణ లభించలేదు. మన ఎంపిలు చాలా మంది నేరస్థులని, అవినీతిపరులని సింగపూర్ ప్రధాని లీ హీన్ లూంగ్ తమ పార్లమెంటు ముఖంగానే ప్రకటించారు. భారత లోక్‌సభ సభ్యుల్లో సగం మందిపై క్రిమినల్ నేరారోపణలున్నాయని చెప్పారు. అందుకు మనం ఆయనను ఏమీ అనలేని స్థితిలో వున్నాము. ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News