Sunday, December 22, 2024

మహిళల ఆసియా కప్: బంగ్లాదేశ్‌పై భారత ఘన విజయం

- Advertisement -
- Advertisement -

సిల్హేట్: మహిళల ఆసియాకప్‌లో భారత్ నాలుగో విజయం నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 59 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ మహిళా టీమ్‌ను చిత్తు చేసింది. షఫాలీ వర్మ ఆల్‌రౌండ్ షోతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక కిందటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో అనూహ్య పరాజయం పాలైన టీమిండియాకు ఈ విజయం ఊరటనిచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 100 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు ఘన విజయం సాధించి పెట్టారు. బంగ్లా జట్టులో ఓపెనర్లు ఫర్జానా హక్, ముర్షీదా ఖాతున్ కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. ముర్షీదా రెండు ఫోర్లతో 21 పరుగులు చేసింది. మరో ఓపెనర్ ఫర్జానా 3 బౌండరీలతో 30 పరుగులు సాధించింది. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ నిగర్ సుల్తానా ఐదు ఫోర్లతో వేగంగా 36 పరుగులు చేసింది. అయితే మిగతా బ్యాటర్లు కనీసం రెండంకెలా స్కోరును కూడా అందుకోలేక పోయారు. దీంతో బంగ్లాదేశ్‌కు ఓటమి తప్పలేదు. ఇక టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసింది. షఫాలీ వర్మ కూడా రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది.
రాణించిన షఫాలీ, మంధాన
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలు శుభారంభం అందించారు. ఇద్దరు బంగ్లాదేశ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మంధాన 6 ఫోర్లతో 47 పరుగులు చేసింది. మరోవైపు షఫాలీ వర్మ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 55 పరుగులు సాధించింది. ఇద్దరు తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ కూడా ధాటిగా ఆడింది. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసిన జెమీమా 4 ఫోర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో భారత్ స్కోరు 159 పరుగులకు చేరింది.

Women’s Asia Cup: India beat Bangladesh by 59 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News