Thursday, January 23, 2025

యూత్ ఆసియా కప్ : ఛాంపియన్ భారత్

- Advertisement -
- Advertisement -

మాంగ్‌కాక్ (హాంకాంగ్): ఎమర్జింగ్ ఆసియా కప్ మహిళల టి20 టోర్నమెంట్‌లో భారత్‌ఎ టీమ్ ట్రోఫీని గెలుచుకుంది. హాంకాంగ్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు పోటీ పడ్డాయి. బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 31 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ఎ టీమ్‌ను చిత్తు చేసి ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియాఎ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.

తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు 19.2 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూల్చారు. ఆరంభం నుంచే బంగ్లాదేశ్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు శాతి రాణా (13), దిలారా అక్తర్ (5)లను మన్నత్ కశ్యప్ ఆరంభంలోనే వెనక్కి పంపింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ మళ్లీ కోలుకోలేక పోయింది. శోభన (16), కెప్టెన్ లత మొండల్ (4), ముర్షిదా ఖాతున్ (1), షోమ అక్తర్ (9)లు జట్టును ఆదుకోవడంలో విఫలమయ్యారు. నాహిదా అక్తర్ 17 (నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది.

భారత బౌలర్లలో శ్రేయంకా పాటిల్ నాలుగు, మన్నత్ కశ్యప్ మూడు, కనిక అహుజా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను బంగ్లా బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. విరిండా దినేశ్ ఐదు ఫోర్లు, సిక్సర్‌తో 36 పరుగులు చేసింది. కనిక అహుజా 4 ఫోర్లతో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఓపెనర్లు శ్వేత సెరావత్ (13), ఉమా ఛెత్రి (22)లు పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో నాహిదా, సుల్తానా ఖాతున్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కాగా, ఆల్‌రౌండ్ షోతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కనిక అహుజాకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News