క్రైస్ట్‌చర్చ్: మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం క్రైస్ట్‌చర్చ్ మైదానంలో జరిగే తుది పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, మాజీ విజేత ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడకుండానే ఫైనల్‌కు చేరుకొంది. మరోవైపు ఇంగ్లండ్ తొలి మూడు మ్యాచుల్లో ఓటమి పాలైనా తర్వాత వరుస విజయాలతో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఆరు, ఇంగ్లండ్ నాలుగు సార్లు ప్రపంచకప్ ట్రోఫీలను గెలుచుకున్నాయి. మహిళల క్రికెట్‌లో ఈ రెండు జట్లదే ఆధిపత్యం. 11 ట్రోఫీల్లో పది ప్రపంచకప్‌లను ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లే గెలుచుకోవడం విశేషం. ఇక ఆదివారం జరిగే ఫైనల్ సమరంలో ఇరు జట్లకు సమాన అవకాశాలున్నాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్లకు అందుబాటులో ఉన్నారు. బ్యూమౌంట్, వ్యాట్, హీథర్ నైట్, డంక్లె, సివర్, బ్రంట్, అమీ జోన్స్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లతో ఇంగ్లండ్ చాలా బలంగా ఉంది.
అంతేగాక ఎక్లెస్టోన్, శ్రుబ్‌సోలే, సివర్, క్రాస్, డీన్ తదితరులతో బౌలింగ్ కూడా చాలా పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియాకు అయితే ఎదురే లేకుండా పోయింది. లీగ్ దశలో ఆడిన ఏడు మ్యాచుల్లోనూ కంగారూ మహిళల జయతేనం ఎగుర వేశారు. సెమీస్‌లో కూడా ఆస్ట్రేలియా అలవోక విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు హేన్స్, హీలీ, కెప్టెన్ మెగ్ లానింగ్, గార్డ్‌నర్, బేథ్ మూనీ, మెక్‌గ్రాత్, జొనాసెన్, షూట్ తదితరులతో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉంది. ఈసారి కూడా ట్రోఫీని సాధించి సత్తా చాటాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా మహిళల టీమ్ పోరుకు సిద్ధమైంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
Women’s ODI WC: Aus vs Eng Final Match on Sunday