Thursday, January 23, 2025

మహిళల వన్డే ప్రపంచ కప్: టైటిల్ పోరుకు ఇంగ్లండ్..

- Advertisement -
- Advertisement -

మహిళల వన్డే ప్రపంచ కప్.. టైటిల్ పోరుకు ఇంగ్లండ్
వ్యాట్ శతకం, చెలరేగిన ఎక్లెస్టోన్, సెమీస్‌లో సౌతాఫ్రికా ఓటమి

క్రైస్ట్‌చర్చ్: డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 137 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరిగే తుది సమరంలో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడుతోంది. ఆస్ట్రేలియా తొలి సెమీస్‌లో విండీస్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ అసాధారణ ఆటను కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ టీమ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 38 ఓవర్లలో కేవలం 156 పరుగులకే ఆలౌటై టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు లిజెల్లి లీ(2), లౌరా వాల్వర్డ్ (0)లను శ్రుబ్‌సోలే వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టించింది. దీంతో సౌతాఫ్రికా 8 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో లారా గుడాల్, కెప్టెన్ సునే లూస్ కొద్ది సేపు పోరాటం చేశారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. అయితే రెండో ఫోర్లతో 21 పరుగులు చేసిన లూస్‌ను క్రాస్ ఔట్ చేసింది. ఆ తర్వాత కూడా ఇంగ్లండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంలో సఫలమయ్యారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన లారా 4 ఫోర్లతో 28 పరుగులు చేసి డీన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యింది. మారిజానె కాప్ (21), వికెట్ కీపర్ త్రిషా చెట్టి (21)లు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. డుప్రీజ్ (30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతావారు విఫలం కావడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 156 పరుగుల వద్దే ముగిసింది.
ఎక్లెస్టన్ మాయ..
మరోవైపు ఇంగ్లండ్ బౌలర్ సోఫి ఎక్లెస్టోన్ అద్భుత బౌలింగ్‌తో అలరించింది. కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసిన ఎక్సెస్టోన్ 36 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టింది. సౌతాఫ్రికా కోల్పోయిన చివరి ఆరు వికెట్లు ఎక్లెస్టోన్ ఖాతాలోకే వెళ్లడం విశేషం.
కదంతొక్కిన వ్యాట్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌కు కూడా శుభారంభం దక్కలేదు. ఓపెనర్ బ్యూమౌంట్ (7) ఆరంభంలోనే పెవిలియన్ చేరింది. అయితే మరో ఓపెనర్ డానిల్లె వ్యాట్ అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను ఆదుకుంది. కెప్టెన్ హీథర్ నైట్(1), నటాలి సివర్ (15) నిరాశ పరిచారు. అయితే వికెట్ కీపర్ అమీ జోన్స్ (28)తో కలిసి వ్యాట్ పోరాటం కొనసాగించింది. ఆ తర్వాత డంక్లె అండతో మరింత చెలరేగి పోయింది. ఇటు వ్యాట్, అటు డంక్లె కుదురుగా ఆడడంతో ఇంగ్లండ్ భారీ స్కోరును సాధించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన వ్యాట్ 125 బంతుల్లోనే 12 ఫోర్లతో 129 పరుగులు చేసింది. డంక్లె 4 బౌండరీలతో 60 పరుగులు సాధించింది. ఎక్లెస్టోన్ (24) కూడా తనవంతు పాత్ర పోషించింది. దీంతో ఇంగ్లండ్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో సఫలమైంది.
హ్యాట్రిక్ ఓటములు ఎదురైనా..
మరోవైపు ఇంగ్లండ్‌కు లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, విండీస్‌లతో జరిగిన లీగ్ మ్యాచుల్లో ఇంగ్లండ్‌కు ఓటమి ఎదురైంది. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఇంగ్లండ్ ముందుకు సాగింది. తర్వాత ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో న్యూజిలాండ్, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లపై ఇంగ్లండ్ జయకేతనం ఎగుర వేసింది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించే దశ నుంచి పుంజుకున్న ఇంగ్లండ్ ఏకంగా ఫైనల్‌కు చేరి సంచలనం సృష్టించింది.

Women’s ODI WC: England beat South Africa by 137 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News