Thursday, January 23, 2025

టీమిండియా ఆశలు గల్లంతు.. ఉత్కంఠ పోరులో హర్మన్ సేన ఓటమి

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్: మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం సెమీ ఫైనల్లోనే ముగిసింది. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీస్‌లో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఒక దశలో భారత్ అలవోకగా విజయం సాధిస్తుందని అందరూ భావించారు. ఆరు ఓవర్లలో 41 పరుగులు చేయాల్సిన స్థితిలోఉండి కూడా టీమిండియా ఓటమి పాలుకావడం కోట్లాది మంది అభిమానులను నిరాశకు గురిచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. షఫాలీ (9), మంధాన రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. వన్‌డౌన్‌లో వచ్చిన యస్తిక భాటియా (4) కూడా నిరాశ పరిచింది. దీంతో భారత్ 28 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

జెమీమా, హర్మన్ పోరాటం
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఒకవైపు వికెట్లను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ గెలుపుపై ఆశలు చిగురింప చేశారు. దూకుడుగా ఆడిన రోడ్రిగ్స్ 24 బంతుల్లోనే ఆరు బౌండరీలతో 43 పరుగులు చేసింది. హర్మన్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో అలరించింది. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన హర్మన్‌ప్రీత్ 34 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి కీలక సమయంలో రనౌట్‌గా వెనుదిరిగింది. ఆ వెంటనే రిచా ఘోష్ (14) కూడా ఔట్ కావడంతో భారత్ మళ్లీ కోలుకోలేక పోయింది. చివర్లో దీప్తి శర్మ 20 (నాటౌట్), స్నేహ్ రాణా (11) రాణించినా జట్టును గెలిపించలేక పోయారు.

మూనీ, లానింగ్ జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అలీసా హీలీ, బెథ్ మూనీ శుభారంభం అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హీలీ 3 ఫోర్లతో 25 పరుగులు చేసింది. మరోవైపు ధాటిగా ఆడిన మూడీ 37 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 54 పరుగులు సాధించింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన మెగ్ లానింగ్ 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 49 పరుగులు చేసింది. గార్డ్‌నర్ 18 బంతుల్లోనే 31 పరుగులు సాధించడంతో ఆస్ట్రేలియా స్కోరు 172 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News