Friday, November 15, 2024

Women’s T20 WC: లంకతో భారత్ ఢీ.. భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్‌కు ఛాన్స్??

- Advertisement -
- Advertisement -

దుబాయి: మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం జరిగే గ్రూప్‌ఎ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. కిందటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. పాక్‌పై విజయం భారత్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. లంకపై కూడా విజయం సాధించాలనే లక్ష్యంతో హర్మన్‌ప్రీత్ సేన పట్టుదలతో ఉంది. గత మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణించింది. అరుంధతి రెడ్డి 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను పడగొట్టింది. ఈసారి కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. శ్రేయంక పాటిల్ కూడా పాక్‌పై అసాధారణ బౌలింగ్‌ను కనబరిచింది. 12 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టింది. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధమైంది. అశా శోభన, దీప్తి శర్మ, రేణుకా సింగ్ తదితరులతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. బౌలర్లు మరోసారి రాణిస్తే ఈ మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు కష్టమేమీ కాదు.

ఇక బ్యాటింగ్‌లోనూ టీమిండియా బలంగా ఉంది. అయితే స్మృతి మంధాన రెండు మ్యాచ్‌లలో కూడా విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా మంధాన తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. మంధాన చెలరేగితే భారత్‌కు భారీ స్కోరు ఖాయం. మరోవైపు షఫాలీ వర్మ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. షఫాలీ దూకుడుగా ఆడితే లంక బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలని భావిస్తోంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగింది. ఈసారి హర్మన్‌పై కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, వికెట్ కీపర్ రిచా ఘోష్, సంన తదితరులతో భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. కానీ కిందటి మ్యాచ్‌లో రిచా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం ఆందోళన కలిగించే అంశమే. ఈసారైనా రిచా తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించాల్సిన అవసరం ఉంది. అంతేగాక జెమమా రోడ్రిగ్స్ కూడా మెరుపులు మెరిపించక తప్పదు. అప్పుడే భారత్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

కాగా, భారత్ సెమీస్‌కు చేరాలంటే లంకపై భారీ తేడాతో గెలవక తప్పదు. ఇప్పటి వరకు భారత రన్‌రేట్ మైనస్‌లోనే ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు రన్‌రేట్‌లో భారత్ కంటే చాలా మెరుగైన స్థితిలో నిలిచాయి. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ తేడాతో గెలవక తప్పదు. ఇక ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన శ్రీలంకకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ అవకాశాలను కాపాడుకోవాలని భావిస్తోంది. కానీ బలమైన భారత్‌ను ఓడించాలంటే లంక సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. అప్పుడే గెలుపు అవకాశాలు ఉంటాయి. లేకుంటే హ్యాట్రిక్ ఓటమి ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News