Friday, January 24, 2025

అక్టోబర్ 3 నుంచి మహిళల టి20 వరల్డ్‌కప్

- Advertisement -
- Advertisement -

దుబాయి: క్రికెట్ అభిమానులను మరో మెగా టోర్నమెంట్ కనువిందు చేయనుంది. మహిళల టి20 ప్రపంచకప్‌నకు అక్టోబర్ 3న తెరలేవనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగనున్న ఈ టోర్నమెంట్‌లో మొత్తం పది జట్లు బరిలోకి దిగుతున్నాయి. టోర్నీలో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి.

గ్రూప్‌బిలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్‌లకు చోటు దక్కింది. యుఎఇలోని షార్జా, దుబాయి వేదికలుగా ఈ టోర్నీ జరుగనుంది. నిజానికి ఈ వరల్డ్‌కప్ టోర్నీ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది. కానీ, బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో వరల్డ్‌కప్‌ను యుఎఇకి మార్చాల్సి వచ్చింది. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 3న ప్రారంభమయ్యే లీగ్ దశ మ్యాచ్‌లు 15న ముగుస్తాయి. ఇక అక్టోబర్ 17న దుబాయి వేదికగా తొలి సెమీఫైనల్ పోరు జరుగుతుంది. రెండో సెమీఫైనల్ 18న షార్జాలో జరుగనుంది. ఫైనల్ సమరం అక్టోబర్ 20న దుబాయి వేదికగా జరుగనుంది.

ఫేవరెట్‌గా ఆస్ట్రేలియా..
ఈ టోర్నమెంట్‌లో మరోసారి ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇతర జట్లతో పోల్చితే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాకు కళ్లు చెదిరే రికార్డు ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆస్ట్రేలియాలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉంది. ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియాను ఓడించి ట్రోఫీని గెలుచు కోవడం ప్రత్యర్థి జట్లకు సవాల్ వంటిదేనని చెప్పాలి.

ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. కిందటిసారి భారత్ ఫైనల్లో ఓటమి పాలైంది. కీలక సమయంలో ఒత్తిడికి గురై మ్యాచ్‌ను చేజార్చుకోవడం టీమిండియాకు అలవాటుగా మారింది. కనీసం ఈ టోర్నీలోనైనా ఆ లోపాన్ని సరిదిద్దుకోవాల్సి అవసరం ఉంది. ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగితేనే టీమిండియాకు ట్రోఫీ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకుంటే మరోసారి భారత్‌కు నిరాశ తప్పక పోవచ్చు. మరోవైపు ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లను కూడా తక్కువ అంచనా వేయలేం. ఈ జట్లకు కూడా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచే సత్తా ఉంది. సమష్టిగా రాణిస్తే ట్రోఫీని సాధించడం వీటికి పెద్దగా కష్టం కాకపోవచ్చు. కానీ ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును తట్టుకుని ట్రోఫీని సాధించడం ఈ జట్లకు శక్తికి మించిన పనిగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

యుఎఇకి టీమిండియా
టి20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు భారత మహిళా జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) బయలుదేరి వెళ్లింది. ప్రత్యేక చార్టెడ్ విమానంలో టీమిండియా క్రికెటర్లు దుబాయి బయలుదేరి వెళ్లారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానతో పాటు ఇతర సభ్యులు దుబాయి పయానమయ్యారు. అంతకుమందు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మీడియా సమావేశంలో జట్టు వ్యూహాల గురించి వెల్లడించింది. ఈసారి ట్రోఫీని సాధించేందుకు సర్వం ఒడ్డుతామని తెలిపింది. తమ అతి పెద్ద సమస్య ఒత్తిడిని తట్టుకోలేక పోవడమేనని, ఈసారి అ లోపాన్ని సరిదిద్దు కుంటామని హర్మన్ ధీమా వ్యక్తం చేసింది. కాగా, ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్‌తో సహా పది దేశాలు పోటీ పడనున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్‌లు ఒకే గ్రూపులో ఉన్నాయి. కాగా, అక్టోబర్ 3 నుంచి 20 వరకు యుఎఇ వేదికగా ఈ టోర్నీ జరుగనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News