Monday, December 23, 2024

మహిళల టి20 వరల్డ్‌కప్: టీమిండియాకు కఠిన పరీక్ష..

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్: మహిళల టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ సమరానికి టీమిండియా సిద్ధమైంది. గురువారం ఇక్కడి న్యూలాండ్స్ స్టేడియంలో జరిగే తొలి సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో కిందటి రన్నరప్ భారత్ తలపడనుంది. లీగ్ దశలో ఆస్ట్రేలియా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచింది. మరోవైపు భారత్ మూడింటిలో గెలిచి ఒక మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది. అయితే భారత్‌తో పోల్చితే ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో చాలా బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు కొదవలేదు.

కాగా, భారత్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. స్మృతి మంధాన తప్ప మిగతా బ్యాటర్లు ధాటిగా ఆడలేక పోతున్నారు. వేగంగా ఆడడంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. ఇది జట్టుకు కలవరానికి గురిచేస్తోంది. ఓపెనర్ షఫాలీ వర్మ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతోంది. ధాటిగా ఆడడంలో పూర్తిగా తేలిపోతోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వేగంగా ఆడడంలో విఫలమవుతోంది. జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ తదితరులు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. ఇలా కీలక ఆటగాళ్లందరూ ఫామ్ లేమీతో బాధపడడం భారత్‌కు ప్రతికూలంగా మారింది.

ఇలాంటి స్థితిలో జట్టు ఆశలన్నీ మంధాన, రిచా ఘోష్‌లపైనే ఆధారపడి ఉన్నాయి. వీరిద్దరూ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. మరోవైపు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మంధాన చెలరేగి ఆడడం కూడా ఊరటనిచ్చే అంశమే. ఈ మ్యాచ్‌లో మంధాన జట్టుకు చాలా కీలకంగా మారింది. మంధాన తన స్థాయికి తగ్గ ఆటను కనబరిస్తే టీమిండియా బ్యాటింగ్ ఇబ్బందులు చాలా వరకు తీరిపోతాయి. అంతేగాక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా మెరుగ్గా రాణించక తప్పదు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఆమెపై నెలకొంది. షఫాలీ, రోడ్రిగ్స్ కూడా తమ బ్యాట్‌కు పనిచెప్పక తప్పదు. లేకుంటే ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టును ఎదుర్కొని విజయం సాధించడం టీమిండియాకు శక్తికి మించిన పనిగానే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తే తప్ప భారత్‌కు గెలుపు అవకాశాలు ఉండవు. ఇందులో హర్మన్ సేన ఎంత వరకు సఫలమవుతుందో వేచి చూడక తప్పదు.

సమరోత్సాహంతో..
మరోవైపు ఆస్ట్రేలియా సెమీస్ సమరానికి సమరోత్సాహంతో సిద్ధమైంది. భారత్‌తో పోల్చితే ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. బెథ్ మూనీ, ఎలిసె పేరీ, కెప్టెన్ మెగ్ లానింగ్, అష్లే గార్డ్‌నర్, తహిళా మెక్‌గ్రాత్, జెస్ జొనాసెస్, అలీసా హీలీ, మెగాన్ షుట్ వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లు ఆస్ట్రేలియాకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ మంధాన, షఫాలీ, హర్మన్, రిచా, రేణుకా సింగ్, రాజేశ్వరి యాదవ్, దీప్తి, పుజా వస్త్రకర్‌లతో కూడిన భారత్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో సెమీస్ సమరం హోరాహోరీగా సాగడం ఖాయం.

జట్ల వివరాలు:
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూజా వస్త్రకర్, దేవికా వైద్య, శిఖా పాండే, రాజీశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్, రాధా యాదవ్, హర్లిన్ డియోల్, అంజలి, యస్తికా భాటియా.

ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), బెథ్ మూనీ, ఎలిసె పేరీ, అష్లే గార్డ్‌నర్, తహిళా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా వెరెహమ్, సదర్లాండ్, అలనా కింగ్, మెగాన్ షుట్, డార్సి బ్రౌన్, అలీసా హీలీ, హీథర్ గ్రాహమ్, జెస్ జొనాసెన్, కిమ్ గ్రాథ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News