కౌలాలంపూర్: మలేసియా వేదికగా జరుగుతున్న మహిళల అండర్19 టి20 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం ఆతిథ్య మలేసియాతో జరిగిన పోరులో యువ భారత్ పది వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన మలేసియా14.3 ఓవర్లలో కేవలం 31 పరుగులకే కుప్పకూలింది.
మలేసియా బ్యాటర్లలో ఒక్కరూ కూడా రెండంకెల స్కోరును అందుకోలేక పోయారు. భారత బౌలర్ వైష్ణవి శర్మ ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను పడగొట్టింది. ఈ క్రమంలో వైష్ణవి హ్యాట్రిక్ కూడా నమోదు చేయడం విశేషం. వైష్ణవి తన చివరి ఓవర్‌లో రోస్లాన్, డానియా, నజ్వాలను ఔట్ చేసింది. మిగతా వారిలో ఆయుషి శుక్లా మూడు వికెట్లను పడగొట్టింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 2.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయం అందుకుంది. తెలుగమ్మాయి గొంగడి త్రిష 12 బంతుల్లోనే అజేయంగా 27 పరుగులు చేసి జట్టును గెలిపించింది.