ఓటు హక్కు కోసం సుదీర్ఘ కాలం పోరాడి మహిళలు ఆ హక్కును సాధించుకున్నప్పటికీ, ఇప్పటికీ స్త్రీలు ఎవరికి ఓటు వేయాలి అనే అంశంలో కుటుంబ పెద్దలు, కుల పెద్దలు జోక్యం చేసుకొని సలహాలు ఇవ్వడం లేదా తమ అభిప్రాయాలకు, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా స్త్రీలతో ఓట్లు వేయించడం, ఎన్నికల్లో వాళ్ళని నిలబెట్టడం జరుగుతూ వుంది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో, దేశాలలో స్త్రీలు రెండవ తరగతి పౌరులుగానో, అంతకన్నా అధములుగానో పరిగణించబడుతున్నారు. రాజకీయాలు, పబ్లిక్ స్పేస్ పురుషుల కోసం, గృహాలు, ఇంటి లోపలి చాకిరి స్త్రీల కోసంగా, సమాజం పబ్లిక్ ప్రైవేట్‌గా చీలిపోయి చాలా కాలమే అయింది. స్త్రీలకు తమవైన సొంత రాజకీయ అభిప్రాయాలు ఉంటాయన్న స్పృహ, జనాభాలో సగభాగంగా ఉన్నా వారికి అన్ని రంగాలలోనూ పురుషులతో పాటు సమంగా నిర్ణయాధికారం ఉండాలన్న స్పృహ మన పౌర సమాజానికి ఇంకా రాలేదు. స్త్రీలు పబ్లిక్ స్థలాల్లోను, రాజకీయాల్లోను ఉండడం, పురుషుడు ఆధిపత్య స్థానంలో వున్న రంగాలలోకి స్త్రీల అక్రమ చొరబాటుగా, తమ అహాన్ని, ఉనికిని, ఆధిపత్యాన్ని సవాలు చేయడంగా మెజారిటీ ప్రపంచం ఇప్పటికీ పరిగణిస్తుంది. రాజకీయాలు సమాజ హితం కోసం, సమాజంలో సమభావనను పెంపొందించి, సుపరిపాలన, సంక్షేమాన్ని, మనిషి కేంద్రంగా జరిగే అభివృద్ధిని తీసుకురావడం కోసం వుండాలి.
సమాజపు అంచులకు నెట్టివేయ బడ్డ సమూహాలకు మొట్టమొదటి ఫలితాలు అందేలా వుండాలి. అటువంటి రాజకీయాలలో పాల్గొనే హక్కు, నాయకత్వం వహించే హక్కు, సమాజాన్ని ముందుకు నడిపించే హక్కు దేశ పౌరులు అందరికీ వుంది. వుండి తీరాలి. భారత రాజ్యాంగం ప్రకారం కుల, మత, ప్రాంతీయ, లైంగిక తారతమ్యాలు లేకుండా ఓటు వేయడానికి లేదా ఎన్నికల్లో నిలబడడానికి దేశపౌరులు అందరికీ హక్కు ఉంది. అయితే ఈ హక్కును వాస్తవ రూపంలో, ఆచరణలో అమలులో పెట్టేందుకు ఏ తారతమ్యాలు అయితే వుండకూడదని రాజ్యాంగం చెప్పిందో, ఆ తారతమ్యాలు అన్నీ వికృత రూపంలో మన సమాజంలో ఉండడం మనకు నిత్యానుభవం. కుల, మత, వర్గ, జెండర్ రహితంగా ప్రజలందరికీ ఒకే న్యాయం వుండాలి అన్న అత్యంత మానవీయ ముఖ్యమైన సంగతి మన మెదళ్లలోకి ఇంకా ఎక్కలేదు. అసమానత ఉన్న సామాజిక వ్యవస్థలో, రాజకీయాలలోకి సమాజపు అంచులకు నెట్టబడ్డ వర్గాలకు, కులాలకు, ట్రాన్స్‌తో సహా అన్ని జెండర్లలకు చెందిన వారు పాల్గొనడానికి అవకాశం వుండాలి. ఇది నిజంగా కష్ట సాధ్యమైన విషయం అన్న ఎరుక ఉండబట్టే చట్టబద్ధంగానే అనేక పరిమితులతోనైనా రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి.
అందువల్ల కనీసం కొన్ని స్థానాల్లో అయినా ఈ సామాజిక సమూహాలకు చెందిన వ్యక్తులు ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి, చట్టసభలలోకి రాగలిగారు. ఈ సమూహాలలో కూడా స్త్రీలు అతి తక్కువ మందే కనపడతారు. మన దేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం అనేక దశాబ్దాలుగా మహిళలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ డిమాండ్‌ను సమర్థిస్తూనే ఉన్నా అనేక రాజకీయ కారణాల వల్ల ఇది ఇప్పటికీ చట్టరూపం తీసుకోలేదు. అంతేకాదు పురుషులు తాము ఇంతవరకూ అనుభవిస్తున్న స్థానాలను, ఆధిపత్యాన్ని కోల్పోవాల్సివస్తుందన్న భయం కూడా అంతర్గతంగా వుండటం బయటకు చెప్పని మరో కారణం. ఆయా పార్టీ తమ పార్టీలలో మహిళలకు సమస్థానం కల్పించడం, ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లో చట్టంతో పని లేకుండానే రిజర్వేషన్ల పాలసీని అమలుపరచడం చేయాలి అని మహిళా ఉద్యమం ఎప్పటి నుంచో కోరుతూనేవుంది. ఇలా చేసేందుకు అడ్డుపడుతున్న విషయం అన్ని పార్టీలలోనూ స్థిరపడిపోయిన పురుషాధిపత్య ధోరణి తప్ప మరొకటి కాదు. అందువలన, మౌలికంగా వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఉంది. అన్ని రకాల పార్లమెంటరీ పార్టీలకి, అలాగే పార్లమెంట్ వెలుపల ఉండి పనిచేస్తున్న వివిధ రకాల రాజకీయ పార్టీలకు జెండర్ సమానత్వంపై నిర్దిష్ట అవగాహన, కార్యాచరణ ఉన్నాయా, వుంటే అవి వాటి నిర్మాణాలలో, రోజు వారీ కార్యకలాపాలలో నిజంగా ప్రతిబింబిస్తున్నయా అని. అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా పురుష కేంద్రంగా ఏర్పడ్డ పార్టీలు. పురుషుల ఆధిపత్యంతో నడిచే పార్టీలు. అలాగే అవి తీసుకునే, చర్చించే సమస్యలు, చేసే ఆందోళనలు, వాటి విధివిధానాల్లో, నాయకత్వాలు అన్ని పురుష కేంద్రంగానే ఉంటాయన్న వాదన ఎంతో కాలంగా ఉన్నదే. అలాగే ఆయా సమాజాల్లో ఉన్న ఆధిపత్య సమూహాలే సంఖ్యా రీత్యా తక్కువగా ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలపైన ఇప్పటి వరకూ రాజకీయ అధికారాన్ని నెరిపారని మహిళలు, దళితులు, ఆదివాసీ, నల్లజాతి ప్రజలు ఎప్పటి నుంచో ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇది మరింత లోతైన, సమాజానికి అవసరమైన చర్చ.
మన దేశంలో పంచాయితీ రాజ్ లాంటి సంస్థలలో చట్టపరంగానే స్త్రీలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల అక్కడ స్త్రీల ప్రాతినిధ్యం చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంది. పేరుకి స్త్రీలు పదవుల్లో ఉన్నప్పటికీ వారి భర్తలు, ఇతర కుటుంబ సభ్యులు లేదా ఆయా గ్రామాల్లోని ఆధిపత్య కులాలకు సంబంధించిన పెద్దలు వాస్తవ అధికారాన్ని కలిగి ఉంటూ, ఈ స్త్రీలను నామమాత్ర అవశేషాలుగా మార్చారన్న వాస్తవం ఎంత మరుగున పరచాలనుకున్నా మరుగునపడేది కాదు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు రాజకీయాల్లో ఎక్కడున్నారో తెలిపే ఒక రాజకీయ మ్యాపింగ్‌ను ‘ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐ పియు), ఇంకా యు.ఎన్. విమెన్’ చేశాయి. ఎంతో పరిశోధన, అధ్యయనం అనంతరం ఒక నివేదికను జనవరి, 2023లో అవి విడుదల చేశాయి. చట్టసభలలోను, అలాగే కీలకమైనటువంటి ప్రభుత్వ అధికారిక స్థానాల్లోనూ స్త్రీలు ఎక్కడ ఉన్నారో ఈ నివేదిక తెలుపుతూ ప్రపంచ వ్యాప్తంగా జండర్‌పరమైన వివక్ష, స్త్రీపురుషుల స్థానాలలో అంతరం అన్ని సమాజాలలో చాలా ఎక్కువగా ఉంది అని పేర్కొంది.
దేశాలకు అధినేతలుగా, ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లోనూ స్త్రీలు కేవలం 31 దేశాల్లోనే ఉన్నారు. పార్లమెంటులో 26.5% మాత్రమే మహిళలున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర స్థాయి కేబినెట్ మంత్రుల్లో 22.8% మాత్రమే మహిళలున్నారు. ఆయా దేశాలలో ప్రజాస్వామిక వాతావరణం ఉన్నప్పుడే మహిళలు ఈ పరిమిత స్థాయిలో అయినా తమకు దొరికిన అవకాశాన్ని, అధికారాన్ని సద్వినియోగం చేయగలుగుతారు. అన్ని రంగాలలోనూ ఉన్నట్టే రాజకీయ రంగంలో కూడా మహిళల పట్ల లైంగిక వివక్ష, వేధింపులు ఉన్నాయని, వీటిని భరించలేని స్థితిలో మొత్తంగానే రాజకీయాల నుండి మహిళలు తప్పుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళా అభ్యర్థులను లైంగికంగా కించపరచటం, వేధించటం, బెదిరించటం, ప్రత్యక్షంగాను, ఆన్‌లైన్ వేదికల ద్వారాను జరుగుతున్నదని ఈ నివేదికే చెప్పింది. జనవరి, 2023 నాటికి రాచరికం కొనసాగుతున్న దేశాలను మినహాయిస్తే, మిగిలిన 150 దేశాలకు గాను 11 దేశాలలో మహిళలు దేశాధిపతులుగా ఉన్నారు.
అంటే కేవలం 11.3% మాత్రమే ప్రపంచంలో మహిళా నాయకత్వం ఉంది. పదేళ్ల క్రితం 5.3% మాత్రమే ఉన్న మహిళా నాయకత్వం ఇప్పుడు కొంత మేరకు పెరిగింది అన్న మాట వాస్తవం. అయినప్పటికీ ఈ సంఖ్య పురుష నాయకులతో పోలిస్తే చాలా తక్కువ. 22.8% మంది మహిళలు కేబినెట్ మంత్రులుగా కొనసాగుతున్నారు. అమెరికా, నార్త్ అమెరికా, యూరప్ దేశాలలో మహిళ కేబినెట్ మంత్రుల సంఖ్య సుమారు 31% వరకు ఉంది. 13 దేశాలలో కేబినెట్ స్థానాల్లో స్త్రీ, పురుష సమానత్వం కనిపిస్తుంది. దాదాపు మగవాళ్ళతోపాటు సమానంగా 50 శాతం మహిళలు ఈ దేశాలలో కేబినెట్‌లో ఉన్నారు. ఇవి అన్నీ ప్రధానంగా యూరప్‌కి చెందిన దేశాలే. ఈ మహిళా కేబినెట్ మంత్రులకు కేటాయించిన శాఖలు ప్రధానంగా జెండర్ సమానత్వం, కుటుంబ, శిశుసంక్షేమం, సామాజిక అభివృద్ధి, సామాజిక భద్రత, ఆదివాసీ, మైనారిటీ కమ్యూనిటీల వ్యవహారాలు, పర్యావరణం, విద్య, పాలన వ్యవస్థ మొదలైనవి.
అదే సమయంలో ఆర్థిక, రక్షణ శాఖలు, న్యాయవ్యవస్థ, దేశరక్షణ, హోంశాఖ, విదేశాంగ శాఖ, ఎనర్జి ఇలా అన్ని ముఖ్యమైన రంగాల్లోనూ పురుష నాయకులే నాయకత్వ స్థానాలలో వుంటూ పాలసీలను రూపొందించడం మొదటినుంచి కొనసాగిస్తూనే ఉన్నారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే నిర్ణయాలను చేపట్టే, అమలుపర్చగల నాయకత్వ స్థానాల్లో పురుషులే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడా ఈ రంగాల్లో మహిళలు కూడా లేకపోలేదు. అయితే పురుషులతో పోల్చిచూసినప్పుడు కేవలం 12% మంది కేంద్ర మంత్రులు డిఫెన్స్, స్థానిక ప్రభుత్వాలు, ఎనర్జీ రంగం, చమురు, మైనింగ్, రవాణా శాఖ, వంటి శాఖలలో ఉన్నారు. మహిళా స్పీకర్లుగా 22.7% మంది మహిళలున్నారు. మిడిల్ ఈస్ట్, దక్షిణాఫ్రికా ప్రాంతాలలో తక్కువ సంఖ్యలో 17.7% మంది ఎంపిలు మాత్రమే ఉన్నారు. చట్టసభలలో మహిళా ప్రాతినిధ్యం దక్షిణాసియా దేశాల్లో ఇలా వుంది. నేపాల్‌లో 33%, బంగ్లాదేశ్‌లో 21%, పాకిస్థాన్‌లో 20% ఇండియాలో 15%, శ్రీలంకలో 5% శాతం దిగువ సభల్లో మహిళా ప్రాతినిధ్యం ఉంది. అన్ని రకాలుగా వెనుకబడిన దేశంగా చెప్పుకునే రువాండాలో 61%, క్యూబాలో 53% నికరగువాలో 52%, మెక్సికోలో 50%, న్యూజిలాండ్‌లో 50% మహిళలు చట్టసభల్లో ఉన్నారు. ప్రధాన స్రవంతి రాజకీయాలలో మహిళల స్థానం ఎక్కడ ఉంది అన్న ప్రశ్న వేసుకుంటే, దేశ, ప్రపంచ రాజకీయాలలో నిర్ణాయక అంశాలలో ఎక్కడైనా మహిళల పాత్ర ఇన్ని శతాబ్దాలు గడిచినా, సహాయక, నష్టపరిహారక పరిధులని, పరిమితుల్ని దాటకుండానే ఉందని మనకు స్పష్టంగా అర్ధం అవుతుంది.
నిర్ణయాధికారం మహిళలకు ఇవ్వకుండా, వాళ్ళని కేవలం అలంకారప్రాయంగా ఉంచుతూ, వెనుక రాజకీయ అధికారాన్ని నెరపేశక్తులు వేరుగా ఉంటాయనే విషయం బహిరంగ రహస్యమే. ప్రపంచ, దేశ రాజకీయాలలో కొందరు మహిళలు రాష్ట్రపతులుగాను, ప్రధాన మంత్రులుగాను లేదా కీలక మంత్రిత్వ శాఖలలో కనబడుతున్నప్పటికీ వీళ్ళ సంఖ్య పురుషులతో పోల్చితే చాలా పరిమితం. ఏదిఏమైనప్పటికీ మహిళలు సంఖ్య రీత్యా రాజకీయాలలో పెరగటం ఒక మార్పుకు మొదటి మెట్టు. కాగా, ఆ రంగంలో కూడా వాళ్ళ హక్కులను వాళ్ళు, పోరాడి, డిమాండు చేసి మరీ సాధించుకోక తప్పదు. రాజకీయ రంగంలో పురుషాధిపత్యాన్ని ప్రశ్నించేటప్పుడు, జెండర్ రీత్యా స్త్రీలు కావడం మాత్రమే చాలదని, తమ లోపల ఉన్నా పురుషాధిపత్య, లొంగుబాటు ధోరణులను వదులు కోకపోతే ప్రజాస్వామిక విలువలు, సామాజిక న్యాయం వైపు నిలబడకపోతే అధికారంలో ఉన్నా స్రీలు సైతం నియంతలుగా మారిన ఉదాహరణలు కూడా మన ముందే ఉన్నాయి.
విమల
(రచయిత్రి సామాజిక కార్యకర్త)