బిజెపి బెదిరింపులకు భయపడం
కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఐటి దాడులు : పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్ : ఐటి దాడులకు అదరం.. బిజెపి బెదిరింపులకు భయపడబోమని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం వివిధ చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఐటి దాడులు జరుగుతున్నాయన్నా రు. కాంగ్రెస్ సునామీలో కమలం గల్లంతు కావడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వంలోనే ముస్లింలకు న్యాయం జరుగుతుందన్నారు. వారం రోజు ల నుంచి కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో మాత్రమే ఐటి దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రేవంత్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే ఎంతోమంది ముస్లింలు మంత్రులు, రాజ్యసభ సభ్యులుగా పనిచేశారన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ మాదిరిగా మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.4 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. వక్ఫ్ భూములను కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి పార్టీలన్నీ కలిసి పనిచేస్తున్నాయన్నారు. జూబ్లీహిల్స్ టికెట్‌ను అజహరుద్దీన్‌కు కేటాయిస్తే ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టడం విచిత్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో, దే శంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. జెండా మోసిన వారికి కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందని రేవంత్ గుర్తుచేశారు. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు నష్టం జరగకుండా కాపాడుకుంటామన్నారు.