Sunday, December 22, 2024

అధ్యక్ష బరిలో లేను.. గీసిన గిరి దాటను

- Advertisement -
- Advertisement -

అధ్యక్ష బరిలో లేను.. గీసిన గిరి దాటను
సోనియాజీ నిర్ణయాన్నిబట్టే సిఎం పదవి
స్పష్టం చేసిన అశోక్ గెహ్లోట్
పార్టీ నాయకురాలితో భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి తాను పోటీ చేయబోనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ గురువారం స్పష్టం చేశారు. దేశ రాజధాని 10 జన్‌పథ్‌లో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో గెహ్లోట్ సమావేశం అయ్యారు. చాలా సేపు మాట్లాడిన తరువాత వెలుపలికి వచ్చి విలేకరుల ప్రశ్నలకు జవాబిచ్చిరు. తాను పార్టీ అధ్యక్ష బరిలో ఉండటం లేదన్నారు. ఇక రాజస్థాన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం, తన పేరిట నేతలు కొందరి నొప్పించే మాటలకు తానే నైతికంగా బాధ్యత వహిస్తున్నానని, జరిగిన పరిణామాలకు తాను సోనియా గాంధీకి క్షమాపణలు తెలియచేశానని వివరించారు. అయినా ఇదంతా కుటుంబంలో అప్పుడప్పుడు తలెత్తే తంతు అని, తామంతా ఒక్కటే అని స్పష్టం చేశారు.

ఇక తాను రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉండవచ్చా లేదా అనేది తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీసుకుంటుందని గెహ్లోట్ తెలిపారు. ఆమె నిర్ణయాన్ని బట్టి తాను పదవిలో కొనసాగడం ఆధారపడి ఉంటుందని విధేయత వ్యక్తం చేశారు. గెహ్లోట్‌ను సిఎం పదవి నుంచి తీసివేస్తే పార్టీలో తిరుగుబాటు తప్పదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో నిరసనలకు, రాజీనామాలతో కార్యాచరణకు దిగిన దశలో రాజస్థాన్ కాంగ్రెస్‌లో తీవ్రస్థాయి ముసలం ఏర్పడింది. అక్కడి పరిణామాలకు వివరణ ఇచ్చుకునేందుకు గెహ్లోట్ సీనియర్ నేత, సహచర మిత్రులు కమల్‌నాథ్ సూచన మేరకు బుధవారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. సోనియాతో భేటీ అయ్యారు. రాజస్థాన్‌లో జరిగిన వ్యవహారాల గురించి సోనియా ఈ దశలో గెహ్లోట్ జవాబును కోరారు. పార్టీ క్రమశిక్షణ ఇదేనా? సీనియర్లు అయి ఉండి వీటిని అనుమతిస్తారా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీ కేంద్ర పరిశీలకుల పట్ల ధిక్కార ధోరణి ఎటువంటి సంకేతాలకు దారితీస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

దీనితో సోనియాకు గెహ్లోట్ సారీ చెప్పారు. జరిగిన పరిణామాలకు తన ప్రత్యక్ష సంబంధం లేకపోయినా తన గురించి పార్టీలో తలెత్తిన రాజకీయ సంక్షోభం తన వల్లనే ఉత్పన్నమైందని భావిస్తూ క్షమాపణ కోరుతున్నానని సోనియాకు తెలిపారు. తాను పార్టీలో క్రమశిక్షణ గల సైనికుడి వంటివాడినని, జరిగిన పరిణామాలు తనకూ బాధకల్గించాయని చెప్పారు. గత 50 ఏళ్లలో తాను పార్టీలో విధేయ వ్యక్తిగానే సాగుతూ వచ్చానని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, నరసింహరావు, సోనియాజీ హయాంలలో ఎక్కడా గీతదాటలేదని, కేంద్ర మంత్రిగా కానీ, రాష్ట్ర కాంగ్రెస్ నేతగా లేదా ప్రధాన కార్యదర్శిగా చివరికి సిఎంగా కూడా ఎప్పుడూ ఎక్కడా కాంగ్రెస్ విధేయుడిగానే ఉన్నానని తెలిపారు. తాను ఇప్పుడు మూడోసారి సిఎంగా ఉన్నానని, తన గురించి ఘటనలతో తాను సిఎం పదవిని వదులుకునే స్థితిలో లేననే సంకేతాలు వెలువడటం తన మనసు నొప్పించాయని విలేకరులకు చెప్పిన గెహ్లోట్ సిఎం పదవిలో నాయకురాలు ఇష్టాయిష్టాలపైనే ఉండటం జరుగుతుందని, ఆమె తీసుకునే నిర్ణయం తనకు ఫైనల్ అని తేల్చివేశారు.
రాహుల్‌ను కలిశాకే పోటీ నిర్ణయం
తాను కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీకిదిగాలని నిర్ణయించుకుంది కేవలం గాంధీ కుటంబ సభ్యులు స్థానానికి విముఖత చూపుతున్నారని స్పష్టం అయిన తరువాతనే అని గెహ్లోట్ తెలిపారు. పలు సార్లు రాహుల్‌ను కలిసి ఆయన బాధ్యతలు తీసుకోవాలని కోరానని, అయితే వినలేదని తెలిపారు. చివరికి భారత్‌జోడోయాత్రలో రాహుల్ ఉండగా కేరళకు వెళ్లి ఒప్పించేందుకు యత్నించానని కానీ ఆయన కుదరదని తెలిపారని, అప్పుడు పోటీకి తన నిర్ణయాన్ని ఖరారు చేసుకున్నానని తెలిపిన గెహ్లోట్ విలేకరుల సమావేశంలో పెద్దగా ఈ దశలో తలెత్తిన జోడుపదవుల సమస్య, జోడుపదవులు కుదరవని రాహుల్ స్పష్టం చేసిన అంశాలను ప్రస్తావించలేదు. అయితే రాజస్థాన్ సిఎంగా తననే కొనసాగించాలని సిఎల్‌పి తరఫున ఏకవాక్య తీర్మానం వెలువడటం తన ప్రమేయం లేకుండానే జరిగిందని, అయితే తీర్మానం వెలువడకుండా తాను నివారించాల్సి ఉంది. కానీ కుదరలేదని, అయినా జరిగినదానికి చింతిస్తున్నానని సోనియాజీకి తెలియచేశానని వివరించారు.

Won’t Contest Congress President Election: Ashok Gehlot

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News