కర్నాటక సిఎం బొమ్మై స్పష్టీకరణ
బెంగళూరు: తమ భూభాగం నుంచి అంగుళం భూమిని కూడా మహారాష్ట్రకు ఇచ్చేది లేదని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. తమ రాజకీయ మనుగడ కోసం భాషాభిమానాన్ని లేదా సరిహద్దు సమస్యను వాడుకోవద్దంటూ ఆయన మహారాష్ట్ర రాజకీయనేతలను కోరారు. సోమవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో కన్నడం మాట్లాడేవారు ఉన్నారని, వారిని కర్నాటకలో విలీనం చేసుకునే విషయమై ఆలోచిస్తున్నామని చెప్పారు. కర్నాటక సరిహద్దుల్లోని ప్రాంతాలలో నివసించే మరాఠీ మాట్లాడేవారు తమను మహారాష్ట్రలో విలీనం చేసుకోవాలని చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆదివారం చేసిన ప్రకటనపై స్పందిస్తూ బొమ్మై ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం ఉందని, రాజకీయ మనుగడ కోసమే ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం భాషాపరమైన ఈ వివాదాన్ని సృష్టిస్తోందని బొమ్మై ఆరోపించారు. ఈ విషయంలో తమ వైఖరి చాలా స్పష్టమని, ఎవరి ఒత్తిళ్లకు తాము తలొగ్గేది లేదని ఆయన చెప్పారు.