Sunday, January 19, 2025

దోపిడిదారులను వదల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రజలకు ఇది ‘మోడీ గ్యారంటీ’

మన తలంగాణ/జగిత్యాల ప్రతినిధి : కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండూ లూటీ పార్టీలేనని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం మైదానంలో సోమవారం జరిగిన బిజెపి విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ తనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని, తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలు దోచుకునేందుకే రాజకీయాలు చేస్తాయని వ్యాఖ్యానించారు.

దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా దాని వెనుక కుటుంబ పార్టీలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు అలాంటి పార్టీల సరసన బిఆర్‌ఎస్ చేరిందని ఆరోపించారు. బిఆర్‌ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టులో, ఢిల్లీ మద్యం వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతికి ఎవరు పాల్పడినా సహించబోనన్నారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా జైలుకు పంపుతానని తేల్చి చెప్పారు. గడిచిన పదేళ్లలో తెలంగాణను పాలించిన బిఆర్‌ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని, ఇపుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణను ఒక ఎటిఎంగా మార్చుకుందని వ్యాఖ్యానించారు. ఒక దోపిడీదారు మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసునని, బిఆర్‌ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం వహిస్తోందని, ఇక్కడి డబ్బు ఢిల్లీ పెద్దలకు చేరుతోందని ఆరోపించారు. కేంద్రంలోని తమ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి వేలాది కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

‘నేను భరతమాత పూజారిని… శక్తి స్వరూపులైన ప్రతి మాత, సోదరి, కుమార్తెలకు తాను పూజారి’ అని మోడీ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల పండగ మొదలైందని, జగిత్యాలలో తనకు ప్రతి మహిళ ఒక శక్తి స్వరూపంలో కనిపిస్తోందని, తనను ఆశీర్వదించేందుకు ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ముంబయిలో జరిగిన రాహుల్ గాంధీ న్యాయ్ జోడో యాత్రను ప్రస్తావిస్తూ ఆ సభలో విపక్షాల అనైక్యత స్పష్టంగా కనిపించిందన్నారు. శక్తిపైనే తమ పోరాటం అంటూ ఛత్రపతి శివాజీ మైదానంలో రాహుల్‌గాంధీ మాట్లాడారని, రాహుల్ ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నానని అన్నారు. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తేలిపోతుందన్నారు. శక్తిని నాశనం చేయాలని విపక్ష కూటమి భావిస్తోందన్నారు. శక్తిని ఎవరైనా నాశనం చేయగలరా… శక్తిని వినాశనం చేస్తానని ఎవరైనా అంటారా అంటూ మోదీ ప్రశ్నించారు. శక్తి వినాశనం చేసే వాళ్లకు… శక్తి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతోందని అన్నారు. శక్తి రూపంలో మహిళలు తనను ఆశీర్వదించేందుకు వచ్చారని, ఇది తన భాగ్యమని తెలిపారు. శక్తి స్వరూపులైన ప్రతి మాత, సోదరి, కుమార్తెలకు తాను పూజారినని చెప్పారు. శక్తి స్వరూపులైన మహిళల రక్షణ కోసం తాను ప్రాణాలు అర్పించేందుకైనా సిద్దంగా ఉన్నానని అన్నారు. తాను భరతమాత పూజారినని పేర్కొన్నారు. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతానికి శివశక్తి అని పేరు పెట్టుకున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు.

అతి పెద్ద ప్రజాస్వామ్య ఉత్సవానికి తొలి అడుగుపడిందన్నారు. తెలంగాణలో బిజెపికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ను ఓడించి తెలంగాణ వికాసం కోసం బిజెపికి ఓటు వేయాలని మోడీ పిలుపునిచ్చారు. తెలంగాణలో బిజెపికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందన్నారు. మే 13న తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని, భారతదేశ వికాసం కోసం, తెలంగాణ వికాసం కోసం బిజెపికి ఓటు వేయాలని కోరారు. ఎన్నికలకు ముందే మోదీ ప్రధాని అవుతారని ప్రజలు నిర్ణయించారని అన్నారు. జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్‌డియే 400 సీట్లకు పైగా గెలుస్తుందన్నారు. విపక్షాల ఇండియా కూటమిలో ఐక్యత లేదని, కూటమిలోని పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో బిజెపికి ఎన్ని సీట్లు ఎక్కువగా వస్తే తనకు అంత శక్తి వస్తుందన్నారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ ఎంపిలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంఎల్‌ఎలు మహేశ్వర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News