ముంబై: ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకం విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉల్లి రైతులు, వ్యాపారులు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో 2 నుంచి 4 నెలలపాటు ప్రజలు ఉల్లిపయాలు తినకపోతే ఏమీ కాదంటూ మహారాష్ట్ర మంత్రి దాదా భూసే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. అయితే కేంద్రం ఈ నిర్ణయాన్ని సరైన సమన్వయంతో తీసుకుని ఉండాల్సిందని కూడా రాష్ట్ర పిడబ్లుడి మంత్రి అయిన భూసే సోమవారం అభిప్రాయపడ్డారు.
ధరల పెరుగుదలను నియంత్రించడంతోపాటు దేశీయ మార్కెట్‌లో ఉల్లిపాయల సరఫరాలను మెరుగుపరచడానికి ల్లిపాయల ఎగుమతిపై 40 శాతం సుంకం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 19న నిర్ణయం తీసుకుంది.2023 డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం అమలులో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
రూ. 10 లక్షల వాహనాన్ని ఉపయోగించేవారు రిటైల్ రేటు కన్నా రూ. 10 నుంచి రూ. 20 వరకు అధిక ధరలకు ఉల్లిని కొనుగోలు చేయగలరని, ఉల్లిపాయాలను కొనుగోలు చేసే స్తోమత లేనివారు 2 నుంచి 4 నెలలు ఉల్లిని తినకపోతే ఏమీ కాదని భూసే వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు ఉల్లిపాయలు క్వింటాలు రూ. 200 పలుకుతుందని, మరి కొన్నిసార్లు రూ. 2,000 వరకు క్వింటలు ధర లభిస్తుందని, చర్చలు జరిపి ఒక సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
భారతదేశంలోనే అతి పెద్ద ఉల్లిపాయల హోల్‌సేల్ మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసర్‌గావ్‌తోసహా నాసిక్‌లోని అన్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలు(ఎపిఎంసి) ఉల్లిపాయల వేలంపాటలను నిరవధికంగా మూసివేయాలని సోమవారం ఉదయం నిర్ణయించాయి. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంతవరకు ఉల్లిపాయల వేలంపాటలలో పాల్గొనరాదని నాసిక్ జిల్లా ఉల్లి వర్తకుల సంఘం పిలుపునిచ్చింది. కేంద్రం ఎగుమతి సుంకాన్ని ఉపసంహరించాలని డిమాండు చేస్తూ పెద్దసంఖ్యలో రైతులు, వర్తకులు సోమవారం జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.