Wednesday, February 26, 2025

హిందీని విధించకపోతే మేము ఆ భాషను వ్యతిరేకించం

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడుపై హిందీని ‘రుద్దకపోతే’ డిఎంకె హిందీని వ్యతిరేకించబోదని, తమిళులపై ఆ భాషను రుద్దడం వారి ఆత్మ గౌరవంతో ఆటలు ఆడుకోవడమే అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ బుధవారం స్పష్టం చేశారు. హిందీ భాషను విధించే అంశంపై పార్టీ సభ్యులకు స్టాలిన్ ఒక లేఖ రాస్తూ, ఆత్మ గౌరవం తమిళులకు ‘విశిష్ట’ స్వభావం అని పేర్కొన్నారు. ‘డిఎంకె ఇప్పటికీ హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నదని అడుగుతున్నవారికి నా వినమ్ర సమాధానం ఏమిటంటే మీరు ఇప్పటికీ మాపై ఆ భాషను రుద్దుతుండడమే కారణన్నది’ అని ఆయన తెలిపారు. ‘మీరు హిందీని విధించకపోతే మేము వ్యతిరేకించం. తమిళనాడులో హిందీ పదాలపై నలుపు రంగు పూయం.

ఆత్మగౌరం తమిళుల విశిష్ట లక్షణం, దానితో ఆటలు ఆడుకోవడానికి మేము ఎవ్వరినీ అనుమతించబోం’ అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో తీవ్ర భాషా వివాదం నేపథ్యంలో స్టాలిన్ ఆ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)లోని త్రిభాషా సూత్రం ద్వారా హిందీని విధించే యత్నం చేస్తున్నదని డిఎంకె ఆరోపించగా, కేంద్ర ప్రభుత్వం ఆ ఆరోపణను ఖండించింది. ఆ అంశం డిఎంకె, రాష్ట్ర బిజెపి శాఖ మధ్య మాటల పోరుకు దారి తీసిన విషయం విదితమే. బిజెపి తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె అన్నామలై ఆ అంశంపై డిఎంకెపై విరుచుకుపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News