Thursday, January 23, 2025

తమిళనాడుకు కావేరి నీళ్లు విడుదల ప్రసక్తే లేదు: డికె శివకుమార్

- Advertisement -
- Advertisement -

తమిళనాడుకు కావేరి నీళ్లు విడుదల ప్రసక్తే లేదు
కెఆర్‌ఎస్ నుంచి నీటి విడుదల బెంగళూరు కోసమే
కర్నాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్
బెంగళూరు: తమిళనాడుకు కావేరి నది నీటిని ఎటువంటి పరిస్థితులలోను విడుదల చేసే ప్రసక్తే లేదని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ సోమవారం స్పష్టం చేశారు. కృష్ణరాజ సాగర్ (కెఆర్‌ఎస్) డ్యామ్ నుంచి తమిళనాడుకు కావేరి నీటిని ప్రభుత్వం విడుదల చేస్తున్నదన్న ఆరోపణల నేపథ్యంలో విమర్శలు, నిరసన ప్రదర్శనల మధ్య శివకుమార్ నీటి విడుదల బెంగళూరుకు ఉద్దేశించినదని, పొరుగు రాష్ట్రానికి కాదని తెలిపారు. కర్నాటక జల వనరుల శాఖ మంత్రి కూడా అయిన శివకుమార్ బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ, ‘ప్రస్తుతానికి తమిళనాడుకు ఎటువంటి పరిస్థితిలోను కావేరి నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదు. ఇప్పుడు మాకు ఆ అవకాశం కూడా లేదు.

తమిళనాడుకు ఎంత నీరు ప్రవహిస్తున్నదనేందుకు ఒక లెక్క ఉంది. ఒక వేళ ఇప్పుడు నీటి విడుదల జరిగినా అక్కడికి చేరేందుకు నాలుగు రోజులు పడుతుంది’ అని చెప్పారు. ‘(తమిళనాడుకు) నీటిని విడుదల చేసేందుకు ఈ ప్రభుత్వంలో మేము ఏమీ మూర్ఖులం కాము’ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దుర్భిక్షం, నీటి సంక్షోభం నెలకొన్న తరుణంలో తమిళనాడుకు కెఆర్‌ఎస్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారనిఆరోపిస్తూ రైత హితరక్షణ సమితి మాండ్య జిల్లా కేంద్రంలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించింది.

కర్నాటక రైతులు, పౌరులకు నష్టం కలిగిస్తూ తమిళనాడులోని తమ కూటమి భాగస్వామి డిఎంకె ప్రయోజనాల పరిరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆసక్తి ఉందని బిజెపి ఆరోపించింది. మాలవల్లిలో శివ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నింపేందుకు కెఆర్‌ఎస్ డ్యామ్ నుంచి కొంత నీరు విడుదల జరుగుతోందని, అక్కడి నుంచి బెంగళూరుకు నీటిని తరలిస్తారని శివకుమార్ వివరించారు. ‘బెంగళూరుకు నీటిని తరలించే ప్రదేశంలో నీటి మట్టం తక్కువగా ఉంది. నీటి తరలింపునకు ఒక మట్టం వరకు నీరు ఉండాలి. ఆ మట్టాన్ని కాపాడేందుకు నీటిని విడుదల చేయడమైంది. బెంగళూరుకు నీటి కోసం ఆ పని జరిగింది’ అని శివకుమార్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News