Monday, December 23, 2024

కోర్టు కేసుల పరిష్కారానికి సమష్టిగా పనిచేయండి

- Advertisement -
- Advertisement -
Work collectively to resolve court cases
సమాచారాన్ని తక్షణమే న్యాయ విభాగానికి పంపించాలి
మార్చి నాటికి అన్ని కేసుల సమాచారం అందించాలి
పర్సనల్, ఎస్టేట్స్ విభాగం అధికారులతో సమీక్షలో సింగరేణి డైరెక్టర్ బలరామ్ ఆదేశం

హైదరాబాద్: అపరిష్కృతంగా ఉన్న కోర్టు కేసుల పరిష్కారం విషయంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ఆయా కేసులకు సంబంధించి న్యాయస్థానానికి సమర్పించాల్సిన సమాచారాన్ని సకాలంలో అందించాలని డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) ఎన్.బలరామ్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు కేసుల విషయంలో జాప్యం వహించొద్దని ఆయన హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల విషయంపై పర్సనల్ విభాగం, ఎస్టేట్స్ డిపార్ట్‌మెంట్, న్యాయ విభాగం అధికారులతో శనివారం (జనవరి 8వ తేదీ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో డైరెక్టర్ మాట్లాడారు. ప్రస్తుతం కంపెనీవ్యాప్తంగా దాదాపు 950 కేసులు కోర్టు లో పెండిగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటి పరిష్కారం కోసం న్యాయ విభాగానికి కావాల్సిన సమాచారాన్ని సంబంధిత ఏరియా పర్సనల్ విభాగం అధికారులు ఎలాంటి జాప్యం లేకుండా అందించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి కేసుల పరిష్కారానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని రీజనల్ న్యాయ శాఖ అధికారుల ద్వారా హైదరాబాద్ న్యాయ విభాగానికి పంపాలని ఆయన సూచించారు. అలాగే కంపెనీ చేపట్టబోయే నూతన ప్రాజెక్టుల భూసేకరణ తదితర విషయాల్లో దాఖలవుతున్న కేసుల విషయంలోనూ ఎస్టేట్స్ అధికారులు సత్వరమే స్పందించాలని, జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు.

కేసులను శూన్య స్థాయికి తీసుకురావాలి

ఈ సందర్భంగా ఏరియాల వారీగా పెండింగ్ కేసులపై హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి జిఎం(స్ట్రాటెజిక్ ప్లానింగ్) జి.సురేందర్ సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఉత్పత్తి, ఉత్పాదకత, లాభాలు, సంక్షేమంలో కొత్త రికార్డులు సృష్టించాలని లక్ష్యం పెట్టుకుని ఆ దిశగా ముందుకెళ్తున్నామని, అలాగే కేసులను శూన్య స్థాయికి తీసుకురావాలన్న లక్ష్యంగా అందరం పనిచేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా గని స్థాయిలోనే ఉద్యోగులకు కంపెనీ నియమ, నిబంధనలను వివరిస్తూ కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా కేసుల నమోదు సంఖ్య తగ్గుతుందన్నారు. కేసుల్లో ప్రధానంగా భూసేకరణ, పునరావాస సమస్యలు, పుట్టిన రోజు మార్పు, డిపెండెంట్, సర్వీసు సంబంధ సమస్యలు ఉన్నాయనీ, వీటికి సంబంధించి కోర్టులకు సమర్పించవలసిన వివరాలను ఏరియాల వారీగా తయారుచేసి వెంటనే పంపించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిఎం (ఎస్టేట్స్) జి.వెంకటేశ్వరరెడ్డి, లా మేనేజర్ శ్రీమతి శీరీషారెడ్డి, డిజీఎం (ఎస్టేట్స్) విజయ్‌కుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ సంజీవరెడ్డి, కొత్తగూడెం నుంచి ఏజీఎం (పర్సనల్) బి.హన్మంతరావు, డిజిఎం (పర్సనల్) కవితానాయుడు, డిజిఎంలు (పర్సనల్) శ్రీనివాస్, మురళీధర్, అన్ని ఏరియాల పర్సనల్ విభాగం, ఎస్టేట్స్, లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News