Thursday, January 23, 2025

వినికిడి లోపం నివారణ కోసం కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలో పెరిగిపోతున్న వినికిడి లోపం నివారణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అన్నారు. మానసిక వైకల్యం పెరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. బధిరుల ఆశాజ్యోతి హెలెన్ కెల్లర్ 143వ జయంతి సందర్భంగా మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హెలెన్ కెల్లర్ విద్యా సంస్థలు,ఎన్‌పిఆర్‌డి టిఎఎస్‌ఎల్‌పిఎ ఆధ్వర్యంలో ‘వినికిడి లోపం, ఆటిజం, మానసిక వైకల్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశంపై స్మారక సెమినార్‘ జరిగింది. వికలాంగుల వాయిస్ మాస పత్రిక ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.

ఈ సెమినార్‌లో హెలెన్ కెల్లర్ విద్యా సంస్థల డైరెక్టర్ ఎమ్ శశిధర్ రెడ్డి, తెలంగాణ ఆడియలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ పాతలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె నాగేందర్, ఇమధ్ ఖాన్ రుమాని, క్లినికల్ సైకాలజిస్ట్ పూజ సిద్ధంశెట్టి, ప్రముఖ ఆడియలాజిస్ట్ సుజన్, ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె వెంకట్, ఎమ్. అడివయ్య, కేంద్ర కమిటీ సభ్యులు అర్ వెంకటేష్, జె. రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యశోద, సహాయ కార్యదర్శలు ఉపేందర్, దశరథ్, బాలిశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1880 జూన్ 27న అమెరికాలోని తుస్కంభియ అనే చిన్న గ్రామంలో హెన్రీ కెళ్లర్, కెట్ అడమ్స్ కెల్లర్ దంపతులకు జన్మించిన హెలెన్ కెల్లర్ 19 నెలల వయస్సులోనే తీవ్రమైన అనారోగ్యం కారణంగా దృష్టిని, వినికిడి శక్తిని కోల్పోయారన్నారు. 1933 లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ బ్లైండ్ సంస్థకు అధ్యక్షురాలుగా ఎంపికై అనేక పుస్తకాలను బ్రెయిలీ లిపిలో ముద్రించిందన్నారు. ప్రస్తుతం ప్రతి 18 మందిలో ఒకరు వినికిడి సమస్య ఎదుర్కొంటున్నారని, ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి వినికిడి సమస్యలున్న వారి సంఖ్య 105 కోట్లకు చేరుతుందని డబ్ల్యుహెచ్‌ఓ ప్రకటించిందని వక్తలు పేర్కొన్నారు. 78 శాతం పేద దేశాల్లో 10 లక్షల మందికి ఒక ఇఎన్‌టి డాక్టర్ కూడా లేరని ఆడియాలజిస్టులు, స్పీచ్ తెరపిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వినికిడి పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యశ్రీ పథకంలో వినికిడి సమస్యలు చేర్చడం ద్వారా ఎక్కువ మందికి వైద్యం అందుబాటులోకి తేవాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కాకతీయ ఇంప్లాంటేషన్ ఉచితంగా చేస్తుందని, దీనిపై విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వీట్స్ తెరపిస్టులు ఆడియాలజిస్టు నియమించడం ద్వారా వినికిడి సమస్య నుండి బయటపడవచ్చని వక్తలు అభిప్రాయపడ్డారు. కేంద్రం అజాధిక అమృత్ మహోత్సవాలు ఒకవైపు చేస్తూ మరోవైపు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ని అభివృద్ధి చేయకుండా అమెరికన్ చైన్ లాంగ్వేజ్ వినియోగించడం దురదృస్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బదిరుల విద్యాభివృద్ధి కోసం సైన్ లాంగ్వేజ్ పాఠశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక టీచర్ల నియమించాలన్నారు.

మనదేశంలో 15 నుండి 20 శాతం మంది వినికిడి మరియు మాట సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని వక్తలు పేర్కొన్నారు. 50 ఏళ్లలోపు వయస్సున్న వారిలో 60 శాతం, 70 ఏళ్ల పై వయసున్న వారిలో 75 శాతం మంది వినికిడి లోపానికి గురవుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 5000 మంది మాత్రమే ఆడియాలజిస్టులు ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రి అన్నింటిలో ఆడియాలజిస్టులను నియమించాలన్నారు.

ప్రతి 66 మంది పిల్లలలో ఒక్కరికి ఆటిజం సమస్య ఉందని. ఆటిజం బాలికల కంటే అబ్బాయిల్లో 40 శాతం ఎక్కువగా నిర్ధారణ అవుతోందన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ఆటిజంను కూడా అంగవైకల్యంగా గుర్తించినా ఇప్పటి వరకు వారికి వైకాల్య ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ ట్రస్ట్ ద్వారా ఆటిజం, సెరిబ్రల్ పాల్సి, మానసిక వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 5 లక్షల మంది పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు .

ఆటిజం ను గుర్తిస్తే నివారించడం సులువు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ప్రైవేట్ క్లినిక్స్ నడుస్తున్నాయని. ఆర్థిక స్తోమత లేని కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. సికింద్రాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లి హ్యాండిక్యాపడ్(ఎన్‌ఐఎమ్‌హెచ్ ) ఉన్నా అక్కడ సరిపడా సిబ్బంది, పరికరాలు లేవన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు ఆటిజం పరీక్షలు నిర్వహించి, వారికోసం ప్రభుత్వం ఉచితంగా థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఆటిజం సమస్య కలిగిన పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆటిజం స్పెషలిస్ట్ డాక్టర్‌లను నియమించాలని, మానసిక సమస్యలు పెరుగుతున్న వాటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వక్తలు కోరారు. సామాజిక భద్రత కోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News