మనతెలంగాణ/జిల్లేడుచౌదరిగూడెం: పరిశ్రమలో పనిచేస్తు చేతి వేళ్లు పోగొట్టుకున్న ఓ కార్మికుడు తన ఆసుపత్రి ఖర్చుల కోసం కంపనీ నుండి డబ్బులు ఇప్పించాలంటూ వేడుకున్నా వారు కరుణించకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన మండల పరిదిలోని తుమ్మలపల్లి గ్రామ శివారులోని ఎల్లమ్మ దేవాలయం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండల పరిదిలోని లచ్చంపేట గ్రామానికి చెందిన తిరుమలేష్ (24) గత 5 సంవత్సరాలుగా లాల్‌పహడ్‌లోని జీబి బేకర్స్ బిస్కట్ కంపనిలోని సూపర్‌వైజర్ బాలకృష్ణ ద్వార మిషన్ ఆపరేటర్ గా పనిచేస్తుండేవాడు. గత జులై నెలలో ప్రమాదవశాత్తు మిషన్ లో చేతులు పడి వేలు పోగొట్టుకోవడంతో పాటు ఆర్థికంగా పూర్తిగా నష్టపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.
కంపని మేనేజర్ మల్లిఖార్జున్, సూపర్‌వైజర్ బాలకృష్ణలు అతనికి ఆర్థిక సహాయంతో పాటు కంపనిలో పర్మినెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామి ఇచ్చారు. తరువాత ఎన్ని సార్లు వారిని సంప్రదించిన సరైన రీతిలో స్పందిచకపోవడంతో పాటు ఉద్యోగం లేదు ఏమి లేదు నీ చావు నీవు చావు అన్న మేనేజర్ మల్లిఖార్జున్ వ్యాఖ్యలకు తీవ్ర దిగ్బ్రాంతికి గురై తన చావుకు మల్లిఖార్జన్ కారణమంటూ వాట్సప్ స్టేటస్ పెట్టుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలై చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తిరుమలేష్‌ను కుటుంభసబ్యులు ఆసుపత్రికి తరలించారు. తిరుమలేష్ సోదరుడు కృష్ణయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సక్రం తెలిపారు.