ఛత్తీస్‌గఢ్ రాయిగఢ్ జిల్లాలో ఒక ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిలో శుక్రవారం పేలుడు సమయంలో ఒక పెద్ద బండరాయి తమ షెల్టర్ వాహనంపై పడినప్పుడు ఒక కార్మికుడు మరణించినట్లు, మరి ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. తమ్నార్ ప్రాంతంలో డొంగామహువా గ్రామంలో జిందాల్ పవర్ లిమిటెడ్‌కు చెందిన గరే పల్మా బొగ్గు గనిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన సంభవించిందని రాయిగఢ్‌లో పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ సంఘటన జరిగినప్పుడు బాధితులు ఒక మొబైల్ బ్లాస్టింగ్ షెల్టర్ వాహనం లోపల ఉన్నారని ఆయన తెలిపారు.
పేలుడు తరువాత ఒక పెద్ద బండ రాయి గాలిలోకి లేచి వారి వాహనంపై పడిందని ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రం ఒడిశాలోని గంజామ్ వాసి అయిన కార్మికుడు ఆయుష్ బిష్ణోయ్ (24) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించగా, రాయిగఢ్ జిల్లాకు చెందిన చంద్రపాల్ రథియా (38), అరుణ్ లాల్ నిషద్ (43) తీవ్రంగా గాయపడినట్లు అధికారి తెలిపారు. క్షతగాత్రులను రాయిగఢ్‌లోని జిందాల్ ఫోర్టిస్ ఆసుపత్రిలోని ఐసియులో చేర్పించినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు ఒక కేసు నమోదు చేశారని, దర్యాప్తు జరుపుతున్నారని ఆయన తెలిపారు.