Wednesday, November 20, 2024

ఉపాధి పెరిగింది

- Advertisement -
- Advertisement -

Workers from other states are working in Telangana:CM KCR

అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ

ఇతర రాష్ట్రాలకు చెందిన 15లక్షల మంది పైచిలుకు కార్మికులు తెలంగాణలో పనిచేస్తున్నారు
మన కూలీలు సరిపోవడం లేదు, పాలమూరుకు బయటి కూలీలు వస్తున్నారు
అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం : శాసనసభలో సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలకు చెందిన 15 లక్షల పైచిలుకు కార్మికులు తెలంగాణలో పని చేస్తున్నారని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్న దానికి ఇదే ఉదాహరణ అని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. సంక్షేమంపై శాసనసభలో శుక్రవారం జరిగిన చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న పనికి, ఉపాధికి మన కూలీలు సరిపోవడం లేదని, రాష్ట్రంలో ఉపాధి పెరిగిందని, ఒకనాడు మనం వలసపోయామని, ఇప్పుడు పొరుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలస వస్తున్నారని పేర్కొంటూ సిఎం కెసిఆర్ సుమతీ శతకంలోని ఓ పద్యాన్ని అసెంబ్లీలో వినిపించారు.

“అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ”

రాష్ట్రంలో అప్పు ఇచ్చేవాడు ఉన్నాడు. అద్భుతమైన వైద్యం ఉంది. అద్భుతమైన నీళ్లు, కరెంట్ ఉన్నాయి. అద్భుతంగా ఉపాధి ఉంది. అందుకే ఇక్కడ పనిచేయడానికి కార్మికులు వస్తున్నారు. బెంగాల్, యూపీ నుంచి వచ్చి నాట్లు వేస్తున్నారు. బీహార్, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పత్తి ఏరడానికి వస్తున్నారు. కర్నూల్ నుంచి మహబూబ్‌నగర్‌కు ఉపాధి నిమ్తిత్తం వస్తున్నారు. వ్యవసాయం విస్తరిస్తుంది. ముంబై బస్సులు సంచరించిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఇతర రాష్ట్రాల కూలీలు వచ్చి పనులు చేస్తుంటే సంతోషంగా ఉందన్నారు. మేం తప్పులు చేస్తే విమర్శించడంలో తప్పు లేదు. కానీ అనవసరంగా మన రాష్ట్ర పరువును బజారున పడేయొద్దని అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ గొప్పగా పురోగమిస్తోందని, రాజకీయాల పేరిట రాష్ట్రాన్ని మలినం చేయొద్దని, రాష్ట్రాన్ని శపించొద్దని, ఇది మనతెలంగాణ… మనందరి తెలంగాణ అని సిఎం కెసిఆర్ తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహారించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తామని, అనాథల కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని సిఎం కెసిఆర్ తెలిపారు.

రూ.10వేల కోట్లతో ఆధునీకరిస్తున్నాం

రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రులను రూ.10 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నామని సిఎం తెలిపారు. మెడికల్ కాలేజీలు గతంలో 4 ఉంటే ప్రస్తుతం 12 కొత్తగా మంజూరు చేశామన్నారు. రానున్న రోజుల్లో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు సిఎం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాశ్వతంగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని మూడు సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. 618 ఫీట్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్‌లో నీళ్లు ఉన్నాయని, 557 మీటర్ల ఎత్తులో ఉన్న మల్లన్నసాగర్‌లో నీళ్లు నింపామన్నారు. అన్నపూర్ణమ్మ, రంగనాయకసాగర్‌లో నీళ్లు ఉన్నాయని సిఎం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వికసిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ మతం, ఆ మతం అని పట్టించుకోకుండా అన్నింటిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అన్ని దేవాలయాలకు నిధులు కేటాయిస్తామన్నారు.

ఎల్‌కెజి నుంచి ఇంగ్లీషు మీడియం…

రెసిడెన్షియల్ స్కూళ్ల, హాస్టళ్లకు విద్యార్థులు హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేస్తామని దసరా తరువాత విద్యార్థులు వచ్చేలా చూస్తామని ఆయన తెలిపారు. ఎల్‌కెజి నుంచి ఇంగ్లీషు మీడియాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, దానికి సంబంధించి చర్చలు జరుపుతున్నామన్నారు. అనాథ పిల్లలు గురించి విన్నా, చూసినా బాధ వేస్తుందనన్నారు. గతంలో ఒక సమావేశానికి వెళ్లినప్పుడు కస్తూర్భా పాఠశాలల్లో చదివే ఇద్దరు ఆడపిల్లలు తమ దగ్గరకు వచ్చి తమది ఈ సంవత్సరం 10 వ తరగతి అయిపోతుందని, తమకు తల్లిదండ్రులు ఎవరూ లేరని ఆ తరువాత ఎక్కడ ఉండాలో తెలియదని తన దగ్గర బాధను చెప్పుకున్నారని సిఎం తెలిపారు. ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధ కలుగుతుందన్నారు. అలాంటి విద్యార్థులకు బిసి సర్టిఫికెట్ ఇవ్వాలని కూడా నిర్ణయించామని దానికి సంబంధించిన విధి, విధానాలు ఖరారు కావాల్సి ఉందన్నారు. చాలా ఆస్పత్రుల వద్ద రోగులకు సహాయంగా వచ్చే వారికి సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆ కష్టాలను చాలా సార్లు చూశానని సిఎం తెలిపారు.

జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా గతంలో సోమేష్‌కుమార్ పనిచేసేటప్పుడు ఆస్పత్రులకు వచ్చే సహాయకులకు సౌకర్యాలు కల్పించాలని తాను సూచించానని సోమేష్‌కుమార్ 5 ఆస్పత్రుల వద్ద దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారన్నారు. సినీహీరో, బసతతారకం ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ తనను కలవడానికి వచ్చినప్పుడు ఆస్పత్రి వెనుక ఖాళీ స్థలంలో రోగుల వెంట వచ్చే సహాయకులకు కోసం సౌకర్యాలు కల్పించాలని తాను సూచించానని, దానికి బాలకృష్ణ కూడా ఒప్పుకొని నిర్మాణాలను చేపట్టారని సిఎం తెలిపారు. పల్లె దవాఖానాలకు రిక్రూట్‌మెంట్ ప్రారంభం అయ్యిందని సిఎం తెలిపారు.

యాదాద్రి ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ

రామానుజుల విగ్రహాన్ని శంషాబాద్ దగ్గర ముచ్చింతల్‌లో నెలకొల్పుతున్నారని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఉన్న వైష్ణవులందరూ దీనిని దర్శిచుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రామానుజుల స్వామి శిష్యుడు చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో యాదాద్రి టెంపుల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి తాను కూడా వస్తానని ప్రధాని మోదీ తెలిపారని సిఎం కెసిఆర్ తెలిపారు. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సుదర్శన యాగాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి నవంబర్ చివరన లేదా డిసెంబర్‌లో యాదాద్రి ఆలయాన్ని పునః ప్రారంభిస్తామని కెసిఆర్ పేర్కొన్నారు. అన్ని ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు పెట్టుకున్నామన్నారు.

అందరి దీవెనలతో ముందుకు వెళుతున్నామన్నారు. సర్వాయి సర్ధార్ పాపన్న, చాకలి ఐలమ్మల వర్థంతులను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. బిసి కులాల్లో ఉండే వారి కోసం 40 ఆత్మగౌరవ భవనాల కోసం స్థలాన్ని కేటాయించామని, దీని విలువ వందల కోట్లు ఉంటుందన్నారు. వాటి నిర్మాణాలను రూ.80 కోట్ల నిధులను సైతం కేటాయించామని సిఎం తెలిపారు. అన్ని కులాలకు న్యాయం చేస్తున్నామన్నారు. రాజా బహదూర్ వెంకటరామ్‌రెడ్డి కళాశాలకు స్థలాన్ని కేటాయించామన్నారు. రెడ్డి, కమ్మ, వెలమ కులస్థులకు భవనాల నిర్మాణాల కోసం స్థలం ఇచ్చామని, అందరికీ సమన్యాయం చేస్తున్నామని సిఎం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News