Monday, December 23, 2024

బ్రెజిల్‌లో వామపక్ష విజయం

- Advertisement -
- Advertisement -

Equal match fee for men and women cricketers

అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన హోరాహోరీ ఎన్నికల్లో బ్రెజిల్ నూతన అధ్యక్షుడు గా వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా(77) ఎన్నిక కావడం అక్కడ కొత్త చరిత్రను సృష్టించింది. తీవ్ర మితవాది, లిబరల్ పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సొనారో (67)కేవలం వొకే పదవీకాలం తర్వాత ఓటమి పాలయ్యారు. అయినా ఆయన గట్టి పోటీ ఇచ్చారు. లూలాకు 50.9 శాతం వోట్లు పడ్డాయి, బోల్సొనారో కు 49.1శాతం వచ్చాయి. బ్రెజిల్ ఓటర్లు కుడి ఎడమల మధ్య దాదాపు చెరి సగంగా చీలిపోయారు. లూలా ఎన్నికలో లాటిన్ అమెరికా రాజకీయా లు మరింతగా వామపక్షం వైపు మొగ్గినట్టు రుజువైంది. మెక్సికో నుంచి అర్జెంటైనా వరకు లాటిన్ అమెరికా లోని పెద్ద దేశాలన్నింటా వామపక్షాలే అధికారం లోకి రావ డం గమనించవలసిన పరిణామం.

ఇది ఆయా దేశాల్లో మితవాద పక్షాల వైఫల్యాన్ని వారి పాలనలో ప్రజల సమస్యలు పెరగడాన్ని సూచిస్తున్నది. బోల్సొనారో ఏలుబడి ధనిక వర్గాలకు అనుకూలంగా సాగిందనే అభిప్రాయానికి తావిచ్చింది. లూలాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తదితరులు అభినందించారు. దీనితో బోల్సొ నారో మరో డోనాల్డ్ ట్రంప్ గా నిరూపించుకొని ఆశాంతి సృష్టించగలరన్న భయాలు తొలిగాయి. ఆయన గత కొంతకాలంగా ఎన్నికల విధానాన్ని విమర్శిస్తూ వచ్చారు. ఇ.వి.ఎంలపై దుమ్మెత్తిపోశారు. 1964-85 మధ్య సాగిన సైనిక నియంత్రత్వంలో బోల్సొనారో కెప్టెన్‌గా పని చేశాడు. అధ్యక్షుడుగా తన మంత్రి వర్గాన్ని మాజీ సైనికాధికారులతో నింపివేశాడు. బోల్సొనారో పాలన విభజన రాజకీయాలకు ప్రసిద్ధిగాంచింది. బ్రెజిల్ జనాభా 215మిలియన్లు. 33.1మిలియన్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని అంచనా. కొవిడ్‌లో బ్రెజిల్ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నది. ఏడు లక్షల మంది చనిపోయారు. అమెరికా తర్వాత రెండవ అత్యధిక కొవిడ్ మరణాలు బ్రెజిల్‌లోనే సంభవించాయి. ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.

బోల్సొనారో పాలనలో ప్రపంచ ప్రసిద్ధ అమెజాన్ అడవులు చెట్ల కూల్చివేతలతో క్షీణించిపోయాయి. లూలా గతంలో 2003 నుంచి 2010 వరకు దేశాధ్యక్షుడుగా చేశారు. ఇది మూడోసారి. వామపక్ష వర్కర్స్ పార్టీ స్థాపకుడు. కార్మికోద్యమాన్ని నడిపించాడు. సైనిక ప్రభుత్వ హయాంలో యూనియన్లకు నాయకత్వం వహించాడు. ఆయన మొదటి అధ్యక్ష పదవీకాలంలో బాలల్లో పోషకాహార లేమి గణనీయంగా (46%) తగ్గింది. ఆకలి పై పోరాటంలో ప్రపంచ యోధుడు అనే బిరుదుతో ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ ఆయనను సత్కరించింది. లూలా హయాంలో బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్థ పుంజుకొన్నది. లక్షలాదిమంది పేదరికం నుంచి బయటపడ్డారు. అయితే ఆయన దిగిపోయిన తర్వాత అవినీతి కేసు ఆయన చుట్టూ బిగుసుకొన్నది. పర్యవసానంగా 580 రోజులు జైలు జీవితం అనుభవించారు. 2019లో సాంకేతిక కారణాల మీద నిర్దోషిగా విడుదలయ్యాడు. అధ్యక్ష పదవి నుంచి జైలుకు అక్కడి నుంచి అధ్యక్ష స్థానానికి లూలా రాజకీయ ప్రస్థానం ఆసక్తికారమయినది. ఆకలిపై పోరాటం సాగిస్తానని జాతి వివక్షను అంతం చేస్తానని ఆమెజాన్ అడవులను కాపాడతానని లూలా హామీలు ఇచ్చారు. అలాగే కనీస వేతనాలను పెంచుతానన్నాడు.

విభజన రాజకీయాలకు తెరదించి ఐక్యతను పునరుద్ధరిస్తానని ప్రకటించాడు. దేశ ప్రజలు నిట్టనిలువునా చీలిపోయి ఉన్నారని ఈ ఎన్నికలే చెబుతున్నాయి. లూలా మొట్టమొదటిసారి అధ్యక్షుడు కావడానికి ముందు బ్రెజిల్‌ను పరిపాలించిన మాజీ అధ్యక్షుడు ఫెర్నాండో హెన్రిక్ కార్దోసో ఈ ఎన్నిక ఫలితం పై వ్యాఖ్యానిస్తూ ప్రజాస్వామ్యం గెలిచింది, బ్రెజిల్ గెలిచింది అని అన్నారు. బ్రెజిల్ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రాన్ హర్షించగా, లూలా విజయం ప్రగతిని, ఆశా వహ మలుపును సూచిస్తున్నదని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ అన్నారు. ఇది సమానత్వానికి, మానవత్వానికి లభించిన విజయమని మెక్సికో అధ్యక్షులు ఒబ్రేడర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జరిగాయాని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయపడ్డారు.

ఇవన్నీ బ్రెజిల్‌కు మెరుగైన పాలనను అందించడంలో కొత్త అధ్యక్షునికి తోడ్పడగలవు, అలాగే అంతర్జాతీయ శాంతికి సుస్థిరతకు తోడ్పడుతూ బ్రెజిల్ మరింత చురుకైన పాత్ర పోషించేలా చేయడంలో లూలా కృతకృత్యుడు కాగలడని ఆశించవచ్చు. మొత్తం 215 మిలియన్ల బ్రెజిల్ ప్రజల కోసం పరిపాలిస్తానని కేవలం తనకు వోటు వేసినవారికోసమే కాదని, రెండు బ్రెజిల్స్ ఉండవని లూలా చేసిన ప్రకటన ఎంతయినా హర్షించదగినది. బ్రెజిల్, ఇండియా మధ్య మంచి సంబంధాలున్నాయి. 1948 లో మనతో దౌత్య సంబంధాలు పెట్టుకొన్న తొలి లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్. 2006లో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడింది. రెండూ బ్రిక్స్, జి-20, ఐబిఎస్‌ఎ (ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా వేదిక )జి-4లలో సభ్యత్వం కలిగి వున్నాయి. లూలా ఏలుబడిలో భారత బ్రెజిల్ ల బంధం మరింత బలపడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News