మన తెలంగాణ/హత్నూర: హత్నూర మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలో గల ఎమ్మెన్నార్ కెమికల్ పరిశ్రమ కార్మికులు మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల వేతన సవరణ చేయకుండా పరిశ్రమ యాజమాన్యం కార్మికులను చిన్న చూపు చూస్తుందని గేటు ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న పనికి తగిన వేతనం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీనియారిటి ప్రకారం ఇంక్రిమెంట్ లు, ఏరియల్స్ ఇవ్వకుండా శ్రమ దోపిడికి గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. పరిశ్రమ యాజమాన్యం చెల్లిస్తున్న చాలీ చాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఇచ్చే రూ.10వేల వేతనంలో ఈఎస్‌ఐ, పీఎఫ్ పోనూ రూ.8వేలు మాత్రమే చేతికందుతున్నాయన్నారు. ఇప్పటికీ అయిన పరిశ్రమ యాజమాన్యం మొండి వైఖరిని విడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
Workers protest at MNR Company in Sangareddy