Sunday, January 19, 2025

170 గంటలుగా టన్నెల్‌లో కూలీలు ..

- Advertisement -
- Advertisement -

ఉత్తర్‌కాశీ : ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలి లోపల జీవన్మరణ సంక్లిష్టతకు చేరిన 40 మంది కూలీల వెతలు తీరేందుకు మరో నాలుగు అయిదు రోజులు అయినా పట్టేలా ఉంది. లోపల చిక్కుపడ్డ కూలీలను భద్రంగా బయటకు తీసుకురావడం పెద్ద సవాలు అయింది. మరో వైపు కూలీలు లోపల చిక్కుపడి ఆదివారానికి ఎనిమిది రోజులు అయింది. సొరంగంలో చిక్కుపడ్డ కూలీల ప్రాణాలు నిలిపేందుకు అధికారులు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు, లోపలివారు నిస్సత్తువ, నిస్పృహలకు గురికాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు యాంటీడిప్రెస్సెంట్స్ పంపిస్తున్నారు. లోపలివారిని రక్షించడం తమ తక్షణ కర్తవ్యం అని, ఇందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామని ఉత్తరాఖండ్ రహదారులు, రవాణా, హైవేల కార్యదర్శి అనురాగ్ జైన్ ఆదివారం తెలిపారు. కూరుకుపోయిన ఈ రాతి టన్నెల్‌లోపల ఇప్పటికీ వెలుగుపర్చుకునేలా విద్యుచ్చక్తి సరఫరా సాగుతూ ఉండటం సమస్య తీవ్రతను తగ్గించింది.

లోపల పైప్‌లైన్ కూడా ఉండటంతో లోపలివారికి మంచినీరు సక్రమంగా అందుతోంది. ఏది ఏమైనా బయటి ప్రపంచంతో ఎటువంటి లింక్‌లేకుండా లోపల మగ్గిపోయి ఉండటంతో వీరిలో కొందరు మానసిక స్థయిర్యం కోల్పోయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని గుర్తించి వీరికి ధైర్యం చెపుతున్నట్లు అధికారులు తెలిపారు. 4 అంగుళాల పైపు ఉండటంతో దీని ద్వారా లోపలికి అవసరం అయిన సామాగ్రిని పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర్‌కాశీలోని సిల్క్‌యారాలో చార్‌ధామ్ యాత్ర సౌలభ్యం కోసం 4531 కిలోమీటర్ల పొడవైన రెండు లేన్ల మార్గపు టన్నెలు నిర్మాణం తలపెట్టారు. ఇప్పుడు కూలిన రెండు కిలోమీటర్ల పరిధి టన్నెల్‌లో విద్యుత్, నీటి సరఫరా ఉండటం కూలీలకు కొంత మేర రేపటిపై ఆశలు చిగురింపచేస్తున్నాయి. తాము డ్రైఫ్రూట్లను కూడా అందచేస్తున్నట్లు వివరించారు. వారం రోజుల క్రితం ఆదివార ఉదయం ఈ టన్నెల్ నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా ఇది కూలింది. వెంటనే కూలీల వెలికితీత పనులు చేపట్టారు. పరిస్థితిని సమీక్షించి అవసరం అయిన మిషిన్లను అత్యవసర రీతిలో విదేశాల నుంచి తెప్పించారు.

అయితే ఇవి కూడా మొరాయించడంతో రోజుల తరబడి సహాయక చర్యలు కుంటుపడుతూ రావడం పరిస్థితిని మరింతగా దిగజార్చింది. అమెరికా నుంచి రప్పించిన అత్యంత అధునాతన ఔగర్ మిషన్ కూడా పనిచేయడం లేదు. మరో వైపు తైవాన్, థాయ్‌లాండ్‌లలోని సునిశితులైన వారి సలహాలు స్వీకరిస్తూ పనులు సాగిస్తూ వస్తూ ఉన్నా ఏడు రోజులు దాటినా ఇంతవరకూ లోపలివారి వెలికితీత కష్టసాధ్యం కావడడంతో , ఈ 40 మందితో పాటు, వారి కుటుంబ సభ్యులు, వారి ఆత్మీయులు, స్నేహితులు, చివరికి ఇటువంటి వాటిపై స్పందించే నైజం ఉన్న వారు తల్లడిల్లుతున్నారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ఈ టన్నెల్ సంక్షోభంపై పెద్ద ఎత్తున సమీక్ష జరిపింది. వివిధ విభాగాల వారితో చర్చించింది. ఐదు మార్గాల ద్వారా వీరిని వెలికితీయడం గురించి నిపుణులతో విశ్లేషణలు జరిగాయి. ఈ క్రమంలో క్షేత్రస్థాయి అధికారుల నుంచి పరిస్థితిని తెలుసుకుని తరువాత కార్యరంగంలోకి దిగాలని నిర్ణయించారు. అయితే కాలం గడుస్తున్న కొద్ది లోపలి ప్రాణాల పరిస్థితి ఏమిటనేది కీలక ప్రశ్న అయింది.

170 గంటలుగా టన్నెల్‌లో కూలీలు ..
వెలికితీతకు మరో ఐదురోజులు
టన్నెల్‌లో కూలీలు కూరుకుపోయి 170 గంటలు దాటింది. వీరిని భద్రంగా వెలికితీసేందుకు కనీసం మరో నాలుగు ఐదు రోజులు పడుతుందని అధికారులు ఆదవారం తెలిపారు. లోపల ఉన్న వారిని భద్రంగా వెలికితీయాల్సి ఉంటుంది. ప్రణాళికయుతంగా పనులు జరగాలి. ఈ క్రమంలో ఎటువంటి తప్పు జరిగినా అది ముప్పు తెచ్చిపెడుతుందని వివరించార. ఇక పర్వతాల గుండా ఈ టన్నెల్ నిర్మాణం జరుగుతున్నందున , అవి అభేధ్య రీతిలో ఉన్నందున వీటిని తొలిగించడం కష్టం అవుతోంది. ఇప్పుడు టన్నెల్ పై ఉన్న పర్వతం పై భాగంలో నిలువుగా ఓ రంధ్రం చేయాలని తలపెట్టారు. దీని ద్వారా కూలీలకు సరైన రక్షణ మార్గం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ పనిని అత్యంత సునిశితంగా ,

పలు స్థాయిల జాగ్రత్తల నడుమ చేపట్టాల్సి ఉంటుంది. లేకపోతే కూలీలు సొరంగంలోనే జీవ సమాధి అవుతారనే భయాందోళనలు ఉన్నాయి. ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఉన్నతాధికారులు కూడా సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వెనువెంటనే అందుబాటులోకి తెచ్చే ఎటువంటి వెలికితీత మార్గం అయినా అమలు చేయాలని నిపుణులతో సమావేశం తరువాత పిఎంఒ బృందం సూచించింది. ఓ వైపు సహాయక చర్యలు సాగుతూనే మరో వైపు మరిన్ని మార్గాలకు ఆలోచించాల్సి ఉంటుందని , ఇది ఎక్కడా అలసత్వానికి వీల్లేని సహాయక చర్యల ఆపరేషన్ అని ప్రధాన మంత్రికి మాజీ సలహాదారు భాస్కర్ కుల్బే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News