మొత్తానికి ఉత్తరాఖండ్ లోని సిల్క్యారా టన్నెల్ లో చిక్కుబడిన 41మంది కార్మికులూ సురక్షితంగా బయటకొచ్చారు. బయట తమకోసం వేచి చూస్తున్న బంధువులను కలసి ఆనందబాష్పాలు రాల్చారు. కానీ వీరిలో ఒక కార్మికుడు మాత్రం బయటకు వచ్చీరాగానే విషాదంలో మునిగిపోయాడు. అందుకు కారణం- అతను టన్నెల్లోంచి మంగళవారం సాయంత్రం బయటకు రాగా, అదే రోజు ఉదయమే అతని తండ్రి కన్నుమూయడం. ఆ కార్మికుడి పేరు భక్తు ముర్ము.
జార్ఖండ్ లోని తూర్పు సింగ్ భమ్ జిల్లాలోని బాహ్దా గ్రామానికి చెందిన భక్తు ఇతర కార్మికులతోపాటు 17 రోజులుగా టన్నెల్లో చిక్కుబడిపోయాడు. బయటకు రాగానే తల్లిదండ్రుల్ని కలవాలని ఎంతో ఆరాటపడ్డాడు. కానీ, అతనొకటి తలిస్తే, విధి మరొకటి తలచింది. అతను బయటకు వచ్చి, తండ్రి కనబడకపోవడంతో ఆరా తీయగా ఇతర బంధువులు ఈ చావు వార్తను అతని చెవిన వేశారు. అంతే, 29 ఏళ్ల భక్తు నోట మాట రాలేదు.తండ్రిని తలచుకుని భోరున ఏడ్చాడు.
తన కుమారుడు టన్నెల్లోంచి బయటపడతాడని అతని తండ్రి 70 ఏళ్ల బర్సా ముర్ముకి ముందు రోజే కబురందింది. దాంతో మంగళవారం ఉదయమే హుషారుగా నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని టిఫిన్ చేశాడట. అయితే మంచంపై కూర్చుని ఉన్న అతను, అకస్మాత్తుగా కిందపడి మరణించాడు. టన్నెల్లో చిక్కుబడిన తన కుమారుణ్ని తలుచుకుని, షాక్ కు గురై అతను చనిపోయినట్లు భావిస్తున్నారు.
భక్తుతోపాటు అతని గ్రామానికి చెందిన సొంగా అనే స్నేహితుడు కూడా టన్నెల్ పనుల్లో పాలుపంచుకుంటున్నాడు. టన్నెల్ కూలిపోయిన రోజు భక్తు టన్నెల్ లోపల పనిచేస్తుండగా, సొంగా మాత్రం బయటే ఉన్నాడు. టన్నెల్ కూలిపోయిన వెంటనే సోంగా, భక్తు ఇంటికి వెళ్లి ఈ వార్త చేరవేశాడు. అప్పటినుంచి భక్తు తండ్రి కొడుకుని తలచుకుంటూ ఆవేదన చెందుతున్నాడని భక్తు బావ చెప్పాడు.