హైదరాబాద్ : ఓలా, ఉబర్ వంటి ప్లాట్ ఫార్మ్ లలో పనిచేస్తున్న టాక్సీ డ్రైవర్ల పని పరిస్థితులపై మాంట్ ఫోర్ట్ సోషల్ ఇన్‌స్ట్టిట్యూట్ హైదరాబాద్ , జాతీయ లా విశ్వవిద్యాలయం ( బెంగుళూరు) భాగస్వామ్యంతో ఒక వర్కుషాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో ఓలా, ఊబర్ కార్మికులు తమ రోజువారీ సమస్యలను పంచుకున్నారు. కంపెనీలు విధించే ప్రోత్సాహక నిబంధనలలో తరచుగా మార్పులు చేయడం , ఒక్క ట్రిప్ లేకుండానే ఐదు గంటల వరకు వెయిటింగ్ పీరియడ్‌లను అనుభవించిన సందర్భాలు ఉంటున్నాయని డ్రైవర్లు వివరించారు.
మాంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ వర్గీస్ మాట్లాడుతూ వర్కర్ల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వర్క్‌షాప్‌లో విశిష్ట అతిధిగా పాల్గొన్న ప్రొఫెసర్ బాబు మాథ్యూ మాట్లాడుతూ వాహనం మీదే, ఓనర్ మీరే అని అంటారు కానీ మెయింటెనెన్స్ , ఇంధనం ఖర్చులు, ప్లాట్ఫారం కమిషన్, పన్నులు అన్ని పోను వారికి మిగిలేది కేవలం ఇరవై శాతమే అని తెలియజేసారు. ఇదంతా డ్రైవర్లపై భారాన్ని మోపుతుందన్నారు. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ లేబర్ స్టడీస్ నుండి మోహన్ మణి ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్లాట్‌ఫారమ్ వర్కర్లపై నిర్వహించిన పరిశోధనా ఫలితాలను సమర్పించారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని సోషియాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ జనార్దన్ వెల్లికాడ్ మాట్లాడుతూ డ్రైవర్లు ఎదుర్కొనే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావిస్తూ పెరుగుతున్న జీవన వ్యయం .. తగ్గుతున్న రైడ్ ఛార్జీల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారం వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు షేక్ సలావుద్దీన్ , వివిధ టాక్సీ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులూ, టాక్సీ, ఆటో డ్రైవర్లు, జొమాటో, స్విగి తదితర కంపెనీ డెలివరీ కార్మికులు పాల్గొన్నారు.