Monday, December 23, 2024

హెచ్చుతగ్గులు ఉంటాయ్..

- Advertisement -
- Advertisement -

World Bank cuts India's GDP

జిడిపిలో కోత, ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం
పలు కంపెనీల క్యూ4 ఫలితాలు
వచ్చే వారం మార్కెట్‌పై నిపుణులు

న్యూఢిల్లీ : గతవారం మూడు సెషన్లు మాత్రమే మార్కెట్లు పనిచేశాయి. గురువారం అంబేడ్కర్ జయంతి, శుక్రవారం గుడ్‌ఫ్రైడే రెండు రోజులు సెలవు కారణంగా మార్కెట్లు పనిచేయలేదు. దీంతో వరుసగా నాలుగు రోజుల విరామం తర్వాత మళ్లీ సోమవారం మార్కెట్లు ప్రారంభం కానున్నాయి. అయితే గతవారం కూడా మార్కెట్లు నష్టాలనే చవిచూశాయి. బుధవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 237 పాయింట్లు కోల్పోయి 58,338 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 54 పాయింట్లు కోల్పోయి 17,475 పాయింట్ల వద్ద స్థిరపడింది. ప్రపంచ బ్యాంక్ జిడిపిలో కోత, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాల దృష్టా వచ్చే వారంలోనూ ఒడిదుడుకులు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే వారం మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాలను(క్యూ4) ప్రకటించే కంపెనీల్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌సిఎల్, నెస్లే ఇండియా వంటి ముఖ్యమైనవి ఉన్నాయి. గతవారం ఐటి దిగ్గజాలు టిసిఎస్, ఇన్ఫోసిస్‌లు క్యూ4 ఫలితాలను ప్రకటించాయి. ఈ రెండు కంపెనీలు కూడా మెరుగైన ఫలితాలను ప్రకటించాయి.

టిసిఎస్ విషయానికొస్తే, గత ఆర్థిక సంవత్సరం(202122) నాలుగో త్రైమాసికం (జనవరి మార్చి) ఫలితాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) నికర లాభం రూ.9,959 కోట్లు నమోదు చేసింది. గతేడాది (202021) ఇదే త్రైమాసికంలో టిసిఎస్ లాభం రూ.9,282 కోట్లతో పోలిస్తే ఇప్పుడు 7.3 శాతం పెరిగింది. ఇక సంస్థ ఆదాయం కూడా రూ.51,591 కోట్లతో 16 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఈ ఆదాయం రూ.43,705 కోట్లుగా ఉంది. ప్రతి ఈక్విటీ షేరుకు రూ.22 చొప్పున కంపెనీ డివిడెండ్‌ను ప్రకటించింది. అయితే మూడో త్రైమాసికంలో (అక్టోబర్‌డిసెంబర్) నికర లాభం రూ.9,806 కోట్లతో పోలిస్తే, ఇప్పుడు దీనిలో స్వల్ప వృద్ధి ఉంది. ఇన్ఫోసిస్ విషయానికొస్తే, క్యూ4లో నికర లాభం రూ.5,686 కోట్లతో 12 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.5,076 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం రూ.32,276 కోట్లతో 23 శాతం వృద్ధిని సాధించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఇన్ఫోసిస్ సిఇఒ సలీల్ పరేఖ్ స్పందిస్తూ, రష్యా క్లయింట్లతో వ్యాపారం చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈక్విటీ షేరుకు రూ.16 చొప్పున డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది.

మార్చిలో 6.95 శాతానికి ద్రవ్యోల్బణం

ఖరీదైన ఆహార పదార్థాల కారణంగా మార్చిలో ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 6.95 శాతానికి పెరిగింది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 5.85 శాతం నుంచి 7.68 శాతానికి పెరిగింది. దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ప్రతి నెలా పెరుగుతూనే ఉంది. మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.75 శాతానికి చేరగా, ఇది అంతకుముందు ఫిబ్రవరిలో ఇది 6.07 శాతంగా ఉంది. జాతీయ గణాంకాల శాఖ ప్రకారం, ఆహార వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం గరిష్ఠానికి చేరింది. ధరల విషయానికొస్తే, వంట నూనె (18.79 శాతం), కూరగాయలు (11.64 శాతం), మాంసం, చేపలు (9.63 శాతం), పాదరక్షలు, దుస్తులు (9.4 శాతం), ఇంధనం (7.52 శాతం) పెరిగాయి. ద్రవ్యోల్బణం రేటు ఆర్‌బిఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతం దాటడం ఇది వరుసగా మూడో నెల కావడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం 2022 ఫిబ్రవరిలో 6.07 శాతం, జనవరిలో 6.01 శాతంగా నమోదైంది.

1.7 శాతానికి పారిశ్రామిక ఉత్పత్తి
దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపి) ఫిబ్రవరిలో 1.7 శాతానికి పెరిగింది. అంతకుముందు జనవరిలో ఇది 1.3 శాతంగా ఉంది. గనుల పనులు పెరగడంతో పారిశ్రామిక ఉత్పత్తి ఊపందుకుంది. 2021 డిసెంబర్‌లో ఐఐపి వృద్ధి 0.4 శాతంతో 10 నెలల కనిష్టానికి పడిపోయింది. ఫిబ్రవరిలో గనుల ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడంతో 4.5 శాతం గ్రోత్ నమోదైంది. అంతకుముందు జనవరిలో ఇది 2.8 శాతంగా ఉంది. మరోవైపు తయారీ రంగం వృద్ధి 1.1 శాతం నుంచి 0.8 శాతానికి తగ్గింది. విద్యుత్ ఉత్పత్తి 0.9 శాతం నుంచి 4.5 శాతానికి పెరిగింది.

జిడిపిలో కోత పెట్టిన ప్రపంచ బ్యాంక్

ప్రపంచ బ్యాంక్ భారతదేశం జిడిపి (స్థూల దేశీయోత్పత్తి)లో కోతపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (202223) జిడిపి అంచనాను 8.7 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది. భారతదేశంతో పాటు దక్షిణ ఆసియా ప్రాంతం మొత్తం కూడా జిడిపి అంచనాలో కోత విధించింది. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా సరఫరా వ్యవస్థ దెబ్బతినడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపనున్నాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News