Monday, January 20, 2025

పుస్తకం హస్తభూషణం

- Advertisement -
- Advertisement -

world book day 2022

ఏప్రిల్ 23వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. విలియమ్ షేక్స్పియర్ వర్ధంతిని పురస్కరించుకుని యునెస్కో ఏప్రిల్ 23, 1995ని మొట్టమొదటి సారిగా ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించారు. ఆనాటి నుండి ప్రపంచంలోని నూరు దేశాలకు పైగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. దీని ముఖ్యోద్దేశమేమనగా ప్రజల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేలా చేయటం. యువతను, బాలలను, విద్యార్థులను చిన్నప్పటి నుండి పుస్తకాలు చదివే విధంగా ప్రోత్సహిస్తే వారిలో విజ్ఞానం, వివేకం పెరగటమే కాకుండా ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకు వచ్చే మన స్థైర్యం ఏర్పడుతుంది. హ్యారీ పోటర్ లాంటి ఏడు భాగాల పుస్తకం యాభై కోట్లకు పైగా హాట్ కేకుల్లాగా అమ్ముడయ్యాయంటే ఆ రచన పుస్తక ప్రియుల మనసును ఎంతగా దోచిందో చెప్పవచ్చు. మంచి పుస్తకం ప్రచురణ విడుదల అయ్యిందంటే చదివే వారికి కొరత లేదనటానికి హ్యారీ పోటర్ పుస్తకమే నిదర్శనం. హ్యారీ పోటర్ పుస్తకం మాదిరే ఎన్నో భాషల పుస్తకాలు సినిమాలు, వీడియోల రూపంలో యూ ట్యూబ్ లాంటి ఛానల్ ద్వారా ప్రజలను జనరంజకం చేస్తున్నాయి. ఆనాటి చందమామ, బుజ్జాయి, బొమ్మరిల్లు లాంటి బాలల పుస్తకాలను పెద్దలు కూడా ఇష్టపడి చదివే వారు.

పూర్వం బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో ప్రయాణించే వారి చేతిలో తప్పని సరిగా ఒక పుస్తకం ఉండేది. ప్రయాణాల్లో కాలక్షేపం మాత్రమే కాకుండా ఒంటరితనాన్ని మరచి పోయే విధంగా, విజ్ఞానం, వివేకం, ఆహ్లాదం కలిగించే విధంగా పుస్తకం ఉపయోగపడుతుంది. మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. ఒక పుస్తకం వెయ్యి మందికి నేర్పుతుంది అనేది సూక్తి. కరోనా సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో చాలా మంది కవులు, రచయితలు కవిత్వం, కథలు, వ్యాసాలు వెలువరించారు. వెబెక్స్, జూమ్ మీటింగుల ద్వారా పుస్తకాల ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహించి రచనలను ఒకరికొకరు పంచుకోవటం జరిగింది. ఆ విధంగా పుస్తక ప్రియులు కరోనా సమయంలో కూడా సాహిత్యాన్ని, రచనలను ఆస్వాదించారు. కవరు పేజీ చూసి పుస్తక ప్రాధాన్యాన్ని అంచనా వేయకూడదనే నానుడి నిజమైనా, కొన్ని సార్లు కవరు పేజీ, పుస్తకం టైటిల్, ముందు మాట, పుస్తకం గురించి క్లుప్తమైన విశ్లేషణ లాంటి వి పాఠకుడిని చదివే దిశగా ప్రోత్సహిస్తుందనుటలో సందేహం లేదు. పుస్తకాలు లేని ఇల్లు ఆత్మలేని శరీరం లాంటిది, పుస్తకం చదివే అలవాటు పెంపొందించుకుంటే ఒంటరి అనే ఫీలింగ్ ఉండదనే విజ్ఞుల మాటలు ముమ్మాటికీ సత్యమనే చెప్పాలి.

కందుకూరి వీరేశలింగం మాటలు మనం స్ఫురణకు తెచ్చుకోవాలి. చిరిగిన చొక్కానైనా తొడుక్కో కానీ జ్ఞానం పెంపొందించుకోటానికి ఒక మంచి పుస్తకం కొనుక్కో అని వారు భాషించారు. పుస్తకాన్ని మించిన స్నేహితులులేరు అని కూడా అంటారు. రామాయణం, మహాభారతం లాంటి కావ్యాలు చదివితే విజ్ఞానం, వివేకం, ఆహ్లాదం పొందటమే కాకుండా ఆనాటి కాలంలోని ప్రజల జీవనశైలి, సంబంధ బాంధవ్యాలు తెలుసుకోగలుగుతున్నాం. ‘పుస్తకం హస్త భూషణం’ అని కూడా అంటారు. అంటే చేతికి పుస్తకం ఒక ఆభరణం లాంటిది అనే అర్థం.పుస్తకాలను చాలా భద్రంగా, స్వంత గ్రంథాలయాన్ని ఏర్పరచుకొని జాగ్రత్తగా చూసుకునే వారు లేకపోలేదు. ఇతరులకు చదువటానికి ఏదేని పుస్తకం ఇవ్వాలంటే కూడా వారి మనసొప్పదు. ‘పుస్తకం పరహస్త గతం గతం, అధవా పునరాయాతి జీర్ణం’ అంటే పుస్తకం పరాయి చేతిలోకి వెళితే తిరిగి రాదు, ఒక వేళ తిరిగి వచ్చినా చిరిగి పోయి వస్తుంది’ అనుకుని జాగ్రత్త పడుతుంటారు.

పుస్తకం గొప్పతనం గురించి చెప్పాలంటే ఉదాహరణలు కోకొల్లలు. తెలుగులో ఎప్పు డో దశాబ్దాల క్రితం అచ్చయిన పుస్తకాలు కూడా ఈనాటికీ పాఠకుల హృదిలో చిరస్థాయిగా నిలిచిపోయా యి. 1890 ప్రాంతం లో గురజాడ వారు కన్యాశుల్కంలో సృష్టించిన పాత్రలు గిరీశం, మధురవాణి, రామప్పంతులు నేటి తరం వారు కూడా ఏదో సందర్భంలో వింటుంటారు. శ్రీశ్రీగా తెలుగువారి మదిని దోచిన శ్రీ రంగం శ్రీనివాసరావు 1933లో రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ లాంటి అభ్యుదయ కవిత్వం ఈ నాటికీ ప్రస్తుత కవులు, రచయితలు తమ రచనల్లో జొప్పించే ప్రయత్నం చేయటం మనం గమనిస్తూనే ఉన్నాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఎలుగెత్తిన దాశరథి కృష్ణమాచార్య రచనలు తెలుగువారి కీర్తిని ఇనుమడింప జేశాయనుటలో సందేహం లేదు.

వారు రచించిన ‘ఆ చల్లని సముద్ర గర్భం’ లాంటి కవిత్వం నేటి గాయకులను ఉర్రూతలూగిస్తుంది. దేవులపల్లి, సినారె లాంటి సినీ కవులు, విశ్వనాథ, చలం లాంటి ఉద్దండులు, మల్లాది వెంకట కృష్ణమూర్తి, యద్దనపూడి, మాదిరెడ్డి లాంటి పూర్వకాలపు రచయితలు, రచయిత్రులు, ప్రస్తుత యువ రచయితలు ఎవరికివారే సాటి. వీరందరి రచనలు మనకు ఆదర్శం. నేడు చాలా పుస్తకాలు ఇంటర్నెట్‌లో పిడిఎఫ్ రూపంలో అందుబాటులో పెడుతున్నారు. మనసుంటే మార్గముంటుంది అన్నట్లు పుస్తకాన్ని కొనుక్కునే అవసరం లేకుండా డౌన్‌లోడ్ చేసుకొని చదువుకునే వెసులుబాటు ఉంది. వివాహాల సందర్భంలో లేదా ఆటల పోటీలు లేదా వకృత్వ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇస్తే శాశ్వతంగా గుర్తుండిపోతుంది. ఏదో ఒక రోజు పుస్తక గ్రహీత ఆ పుస్తకాన్ని చదివి పుస్తక పఠనాన్ని అలవరచుకునే అవకాశం లేకపోలేదు.

సంవత్సరానికోసారి కొన్ని వేల తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల పుస్తకాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించే పుస్తక ప్రదర్శన, అందులో కవి సమ్మేళనాలు, పాఠకుల సంఖ్యను నిస్సందేహంగా పెంచుతున్నాయి. ఇటువంటి పుస్తక ప్రదర్శన హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా నిర్వహిస్తే మంచిది. ప్రభుత్వ గ్రంథాలయాల సంఖ్య పెంచి, ప్రతి గ్రంథాలయానికి కావలసిన సౌకర్యాలు చేపట్టాలి. మనోవికాసానికి, విజ్ఞానానికి, వినోదానికి దోహదం చేసే పుస్తకాలను ఎప్పటి కప్పుడు గ్రంథాలయాల్లో చేర్చాలి. తగినన్ని నిధులు కేటాయించి పుస్తకాలు సేకరించి పబ్లిసిటీ ద్వారా ప్రజలను గ్రంథాలయాల వైపు మళ్లించాలి. అప్పుడే విలువలతో కూడిన సమాజం ఏర్పడుతుంది.

తడకమళ్ళ మురళీధర్- 9848545970

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News