Monday, December 23, 2024

చరిత్ర సృష్టించిన నీతూ, స్విటీ..

- Advertisement -
- Advertisement -

చరిత్ర సృష్టించిన నీతూ, స్విటీ
ప్రపంచ బాక్సింగ్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
నేడు పసిడి కోసం పోటీ పడనున్న నిఖత్, లవ్లీనా
న్యూఢిల్లీ: రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు నీతూ గాంగాస్, స్విటీ బూరాలు చరిత్ర సృష్టించారు. శనివారం జరిగిన ఫైనల్ పోటీల్లో నీతు, స్విటీలు విజయం సాధించి స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. 48 కిలోల విభాగం ఫైనల్లో నీతు అలవోక విజయాన్ని అందుకుంది. మంగోలియా బాక్సర్ లుత్సాయిఖాన్‌తో జరిగిన ఫైనల్లో నీలు 50 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే కళ్లు చెదిరే పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకు పడిన నీతు సునాయాస విజయాన్ని దక్కించుకుంది. నీతు ధాటికి ప్రత్యర్థి కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. చివరి వరకు పూర్తి ఆధిపత్యం చెలాయించిన నీతు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచ బాక్సింగ్‌లో స్వర్ణం సాధించిన ఆరో బాక్సర్‌గా నీతు చరిత్ర సృష్టించింది. తర్వాత జరిగిన 81 కిలోల విభాగం ఫైనల్లో స్విటీ బూరా విజయం సాధించింది.

చైనాకు చెందిన వాంగ్ లినాతో జరిగిన హోరాహోరీ ఫైనల్లో స్విటీ 43 తేడాతో జయభేరి మోగించింది. ఆరంభం నుంచే ఇద్దరి మధ్య పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు వాంగ్ అటు స్విటీ ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. దీంతో ఫైనల్ పోరు యుద్ధాన్ని తలపించింది. అయితే చివరి వరకు నిలకడైన ప్రదర్శన కనబరిచిన స్విటీ స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. 2014లో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌లో రజతంతో సరిపెట్టుకున్న స్విటీ ఈసారి స్వర్ణాన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఇదిలావుంటే ఇప్పటి వరకు మహిళల ప్రపంచ బాక్సింగ్‌లో మేరీకోమ్, సరితా దేవి, జెన్ని ఆర్‌ఎల్, లేఖ కేసి, నిఖత్ జరీన్‌లు మాత్రమే పసిడి పతకాలు సాధించారు. తాజాగా వీరి సరసన నీతు, స్విటీలు నిలిచారు. కాగా, ప్రపంచ బాక్సింగ్‌లో మేరీకోమ్ రికార్డు స్థాయిలో ఆరు స్వర్ణాలు సాధించి అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.

అందరి కళ్లు నిఖత్‌పైనే
మరోవైపు ఆదివారం మరో రెండు స్వర్ణాలు కోసం భారత బాక్సర్లు పోటీ పడనున్నారు. 50 కిలోల విభాగంలో నిఖత్ జరీన్, 71 కిలోల విభాగలో లవ్లీనా బొర్గొహెయిన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోకున్నారు. తెలంగాణ ఆణిముత్యం నిఖత్ జరీన్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈసారి కూడా స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉంది. దేశ వ్యాప్తంగా అందరి దృష్టి నిఖత్, లవ్లీనాలపైనే నిలిచింది. ప్రపంచ బాక్సింగ్‌లో వీరిద్దరూ ఎదురులేని శక్తులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో తెలుగుతేజం నిఖత్ జరీన్ అంతర్జాతీయ బాక్సింగ్‌లో అసాధారణ ఆటతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో కూడా పసిడి సాధించి సత్తా చాటాలని భావిస్తోంది. ఆదివారం సాయంత్రం జరిగే ఫైనల్లో నిఖత్ వియత్నాంకు చెందిన న్యూయెన్‌తో తలపడనుంది. మరో ఫైనల్లో లవ్లీనా ఆస్ట్రేలియాకు చెందిన కైతిన్ పార్కర్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News