Thursday, January 9, 2025

వినియోగదారుడా తెలుసుకో..

- Advertisement -
- Advertisement -

వివిధ ప్రాంతాలలో తయారు అయ్యే వస్తువులు గాని, సేవలు గాని చిట్టచి వరకు ఉపయోగించే వారే వినియోగదారులు. వినియోగం లేకుంటే ఉత్పత్తిదారులకు ఉత్పత్తి చేయడానికి అవసరం ఉండదు. ఆర్ధిక, వ్యాపార, ప్రచార రంగాలలో, సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు, వారి సేవలను వినియోగించుకునే వ్యక్తిగా వినియోగదారుడు ఉంటాడు. వినియోగదారుడు ఒక వ్యక్తి కావచ్చు. కానీ తనకు నాణ్యత పరంగా లేదా మన్నిక పరంగా అనుకున్నట్లు లేదా కంపెనీ చెప్పినట్టు లభించక పోతే వినియోగదారునిగా ఉన్న సామాన్యుడు నష్టపోవాల్సిందేనా.. వినియోగదారుడు కొన్న వస్తువు నాణ్యత నిర్దేశించబడిన దాని కంటే తక్కువగా ఉంటే, దాని వలన కలిగే ఆర్థిక, ఇతర నష్టాలను ఆ వస్తువును తయారు చేసిన సంస్థ భరించాల్సి వుంటుందని సాధారణ పౌరుడు తెలుసుకోగలగాలి. అందుకే వినియోగదారులకు మద్దతుగా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 15న నిర్వహిస్తారు.

వినియోగదారుడు లేకుంటే అసలు వ్యవస్థనే ఉండదు. వినియోగదారులకు వారు వాడే వస్తువుల నాణ్యత గురించి, వస్తువుల సామర్థ్యం గురించి, వాటి స్వచ్ఛత గురించి, వాటి ధరల గురించి పూర్తి సమాచారాన్ని అందించడం కోసం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం జరుపబడుతున్నది. ఈ విషయాన్ని ప్రతి వినియోగదారుడు గుర్తుంచుకుంటే న్యాయం జరిగే అవకాశం ఉంది. దీని కోసం అంతర్జాతీయ వినియోగదారుల సంఘం 1983లో ప్రారంభం అయినప్పటికీ, మార్చి 15, 1962 నుండి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం జరుపుకుంటున్నారు. మార్చి 15న అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించగా అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ అమెరికా ప్రజలకు మొదటి సారిగా నాలుగు వినియోగదారుల హక్కులు ప్రకటించడం, 1982లో అంతర్జాతీయ వినియోగదారుల సంఘం ప్రాంతీయ సంచాలకుడైన అన్వర్ ఫజల్ మార్చి 15 తేదీని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించగా, ప్రపంచ వ్యాప్తంగా 1983 మార్చి 15 నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

1989 మార్చి 15న భారత ప్రభుత్వం కూడా వినియోగదారుల దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవం రోజున వినియోగదారుల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు నిర్వహిస్తూ వినియోగదారులకు అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. వినియోగదారుల హక్కులను సంరక్షించే ఉద్దేశంతో వారి హక్కులను కాపాడడం కోసం శాసనం ద్వారా వినియోగదారుల రక్షణ చట్టంను ఆమోదించారు. ఈ చట్టం వినియోగదారులకు అన్ని రకాల మోసాలు, అవకతవకల నుండి రక్షణను కల్పించి పరిష్కార, నివారణ మార్గాల ద్వారా వారికి నష్టపరిహారం అందించడంలో తోడ్పాటును అందిస్తుంది. వినియోగదారుడు సమాజంలో వినిమయం చేయబడే వస్తువుల లేదా సేవలను పొందే వ్యక్తి లేదా వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల రక్షణ చట్టం చేయబడింది. దీని ప్రకారం ఒక వినియోగదారుడు కొన్న వస్తువు నాణ్యత నిర్దేశించబడిన దాని కంటే తక్కువగా ఉంటే దాని వలన కలిగే ఆర్థిక, ఇతర నష్టాలను ఆ వస్తువును తయారు చేసిన సంస్థ భరించాల్సి వుంటుంది. ఒక దేశం ఆర్థిక వ్యవస్థలో వినియోగదారులే కీలక పాత్ర వహిస్తారు.

ఎందుకంటే తయారు అయ్యే వస్తువులు కానీ, సేవలను వినియోగదారులు వాడకుంటే ఉత్పత్తిదారులకు ఉత్పత్తి చేయడానికి ప్రేరణనే ఉండదు. వారి వస్తువుల లేదా ఉత్పత్తి, సేవల కోసం సమర్థవంతంగా పంపిణి చేయుటకు వ్యాపార నైపుణ్యత, విక్రయించడానికి ఒక లక్ష్యంను కలిగి ఉండాలి. వినియోగదారుల మార్కెట్లు, పారిశ్రామిక మార్కెట్లు, వాణిజ్య మార్కెట్లు, లాభాపేక్షలేని సంస్థలు, ప్రభుత్వ మార్కెట్లు, ఇవియేగాక అంతర్జాతీయ మార్కెట్ల ద్వారా కూడా వ్యాపారం నిర్వహించబడుతుంది.దేశంలో మారుతున్న శాస్త్ర, సాంకేతిక, విజ్ఞానాభివృద్ధి వల్ల ప్రజలకు వివిధ రంగాల్లో మరింత మెరుగైన సేవలందుతున్నాయి. నూతన వ్యాపారాభివృద్ధి సంస్కరణల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో, ఇ -కామర్స్, టెలిషాపింగ్ విధానంలో వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రజలను మోసగించే సైబర్ నేరాలు చోటుచేసుకుంటున్నాయి. వినియోగదారులను తప్పుడు ప్రకటనలు, సందేశాలతో మోసగించడం పెరిగిపోతున్నది. దీంతో వినియోగదారుల హక్కుల రక్షణ కోసం కొత్త చట్టాల ఆవశ్యకత ఏర్పడింది.

1986 నాటి చట్టం స్థానం లో 2019లో మరో చట్టాన్ని రూపొందించారు. అది 2020 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. వాణిజ్య వ్యాపారాల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో, సేవా సంస్థల్లో పని చేసే వారు నిర్లక్ష్యంగా, మోసపూరితంగా వ్యవహరించినప్పుడు కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రపంచంలోని చట్టాలన్నింటి కన్నా మెరుగ్గా భారత దేశంలో తొలిసారి 1986లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించారు. తక్కువ సమయంలో అంటే 3 నెలలు, అతి తక్కువ రుసుముతో, దళారుల ప్రమేయం లేకుండా జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాల్ని, కమిషన్లను ఆశ్రయించి వ్యక్తిగతంగా సత్వర న్యాయం పొందే సౌలభ్యం దీని ద్వారా లభించింది. ఇప్పుడు సైబర్ నేరాల కారణంగా దాని స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ నూతన చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు పరుస్తున్నారు. వినియోగదారుడు తమ వస్తువుల విలువలను పట్టి జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వినియోగదారుల కమిషన్ కు తమ కేసులను పెట్టవచ్చును లేదా తనకు పరిష్కారం కాకపోతే వినియోగదారుడు జాతీయ కమిషన్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

క్రింది స్థాయి కమిషన్ తనకు తీర్పు ఇచ్చిన తేదీ నుండి ఒక నెలలోపు రాష్ట్ర కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీల్ చేయవచ్చు. రాష్ట్ర స్థాయి, జాతీయ కమిషన్ ముందు అప్పీల్ దాఖలు చేయడానికి ఎటువంటి రుసుము లేదు. జాతీయ కమిషన్ ఆదేశాలకు వ్యతిరేకంగా వినియోగదారుడు, సుప్రీంకోర్టులో 30 రోజులలోపు కేసును కూడా పెట్టవచ్చును. ఇన్ని సౌకర్యాలు ఉన్నా కూడా వినియోగదారుడు మేలుకొనలేక పోతున్నాడు. వినియోగదారుల ఫిర్యాదులకు స్పందించడానికినిర్వహించబడుతున్న జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్‌ను టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-4000ను వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రారంభించి అన్ని పని దినాలలో ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు టోల్ ఫ్రీ నెంబర్ సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమకు నష్టం జరిగిందని భావిస్తే చట్టంను వినియోగించుకోవాలి. ఈ చట్టం పట్ల ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించినట్లైతే ప్రతి వ్యక్తికి ఉపయోగకరంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News