చికాగో నగర జనాభాకన్నా ఇది ఎక్కువ
ఇప్పటికీ సగటున రోజుకు 12 వేల మరణాలు, 7 లక్షల కేసులు
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అంచనా
రియోడిజనిరో: ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య శనివారం నాటికి 30 లక్షలకు చేరుకుంది. కరోనా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన టీకా కార్యక్రమం ఆశించిన స్థాయిలో కొనసాగకపోవడం, బ్రెజిల్, భారత్‌లాంటి దేశాల్లో సెకండ్ వేవ్ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో మృతుల సంఖ్య 30 లక్షలకు చేరుకోవడం గమనార్హం. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ రూపొందించిన ఈ మరణాల సంఖ్య ఉక్రెయిన్‌లోని కీవ్, వెనిజులాలోని కార్కాస్, పోర్చుగల్‌లోని లిస్బన్ నగరాల జనాభాకు సమానం. చికాగో నగర జనాభా (27 లక్షలు)కన్నా ఎక్కువ. ఫిలడెల్ఫియా, డల్లాస్ నగరాలు రెండింటి జనాభాకు సమానం. అయితే ఇది అంచనా లెక్క మాత్రమే. వాస్తవానికి మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. చాలా ప్రభుత్వాలు వాస్తవ మరణాల గురించి లెక్కలు ప్రకటించకపోవడం, కొన్ని మరణాలనుప్రభుత్వాలను పట్టించుకోకపోవడం కూడా ఉన్న నేపథ్యంలో మరణాల సంఖ్య ఎక్కువే ఉంటుందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నిపుణులు అంటున్నారు.
ఇక కొవిడ్ విజృంభణ, దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఫలితాలు కూడా అన్ని దేశాల్లో ఒకే మాదిరిగా లేకపోవడం గమనార్హం. ఒకప్పుడు కరోనా మహమ్మారికి అతలాకుతలమైన అమెరికా, బ్రిటన్‌లు టీకా ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తూ ఉండడంతో అక్కడ క్రమంగా సాధారణ జనజీవనం నెలకొంటోంది. మరో వైపు అటు ఫ్రాన్స్‌లాంటి సంపన్న దేశౠలు కానీ, ఇటు భారత్ లాంటి పేద దేశాలు కానీ టీకా ప్రక్రియను ఆశించిన స్థాయిలో కొనసాగించ లేకపోవడంతో పాటు, కేసులు పెరిగిపోతుండడంతో కొత్తగా లాక్‌డౌన్‌లు, ఇతర ఆంక్షలు విధించడం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ సగటున రోజుకు 12 వేలకు పైగా మరణాలు, 7 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఒక్క అమెరికాలోనే మరణాల సంఖ్య 5,60,000 ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన ప్రతి ఆరుగురిలో ఒకరు అమెరికన్ అన్న మాట. ప్రపంచంలోని అన్ని దేశాల్లోను ఇదే అత్యధికం. అమెరికా తర్వాత ఎక్కువ మరణాలు సంభవించిన దేశాల్లో బ్రెజిల్, మెక్సికో, భారత్, బ్రిటన్‌లున్నాయి.