Monday, November 18, 2024

అఫ్గాన్ మరో సంచలనం… పాకిస్థాన్‌పై చారిత్రక విజయం

- Advertisement -
- Advertisement -

చెన్నై: వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ మరో సంచలనం నమోదు చేసింది. చెన్నై వేదికగా పటిష్టమైన పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌పై అఫ్గాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ వరల్డ్‌కప్‌లో అఫ్గాన్ ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. తాజాగా పాక్‌ను కూడా ఓడించి పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ ఓటమితో పాకిస్థాన్ సెమీ ఫైనల్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.

తర్వాత లక్షఛేదనకు దిగిన అఫ్గాన్ 49 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌కు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రాహీం జర్దాన్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ధాటిగా ఆడిన గుర్బాజ్ 53 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్‌తో 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు.

ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇబ్రాహీం జర్దాన్ 10 ఫోర్లతో 87 పరుగులు సాధించాడు. రహ్మాత్ షా కూడా ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ఆడిన హష్మతుల్లా షాహిది 4 ఫోర్లతో అజేయంగా 48 పరుగులు సాధించాడు. దీంతో అఫ్గాన్ మరో వికెట్ కోల్పోకుండానే చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను ఓపెనర్ అబ్దుల్లా షఫిక్, కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు ఆదుకున్నారు. షఫిక్ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బాబర్ ఆజమ్ 74 పరుగులు సాధించాడు. సౌద్ షకిల్ (25), షాదాబ్ ఖాన్ (40)లు కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఇఫ్తికార్ అహ్మద్ 27 బంతుల్లోనే 4 సిక్సర్లు, రెండు బౌండరీలతో 40 పరుగులు చేశాడు. దీంతో పాక్ స్కోరు 282 పరుగులకు చేరింది.

సంబరాల్లో మునిగిన క్రికెటర్లు..
పాకిస్థాన్‌పై చారిత్రక విజయం సాధించడంతో అఫ్గానిస్థాన్ క్రికెటర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన విజయాన్ని అందుకున్న అఫ్గాన్ క్రికెటర్లు చెపాక్ స్టేడియంలో సంబరాలు చేసుకున్నారు. రషీద్ ఖాన్, నబితో సహా ఇతర క్రికెటర్లు మైదానంలో పరుగులు తీసి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. అఫ్గాన్ ఆటగాళ్ల సంబరాల్లో భారత మాజీ స్టార్లు అజయ్ జడేజా, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు పాలుపంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News