Sunday, January 19, 2025

ఆస్ట్రేలియాకు కీలకం.. నేడు కివీస్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం ధర్మశాల వేదికగా జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచిన ఆస్ట్రేలియా ఈసారి కూడా విజయంపై కన్నేసింది. మరోవైపు న్యూజిలాండ్ ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచి జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌కు మరింత చేరువ కావాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

నెదర్లాండ్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అసాధారణ ఆటతో అదరగొట్టింది. మాక్స్‌వెల్ 40 బంతుల్లోనే శతకం సాధించి కొత్త రికార్డును సృష్టించాడు. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ కూడా వరుస శతకాలతో చెలరేగి పోతున్నాడు. స్టీవ్ స్మిత్, మిఛెల్ మార్ష్, లబుషేన్, జోస్ ఇంగ్లిస్, గ్రీన్, కమిన్స్ తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

ఈ మ్యాచ్‌లో కూడా బ్యాటర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే నెదర్లాండ్స్‌తో పోల్చితే కివీస్ చాలా బలమైన జట్టు అనే విషయాన్ని ఇక్కడ మరువ కూడదు. దీంతో ఈసారి గెలుపు ఆస్ట్రేలియాకు అంత తేలికకాదనే విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కివీస్‌ను ఓడించాలంటే ఆస్ట్రేలియా సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. అప్పుడే గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలు మరింత పెరుగుతాయి.

జోరుమీదుంది..
మరోవైపు న్యూజిలాండ్ ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత నిలకడైన ఆటతో అలరిస్తోంది. కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిఛెల్, కెప్టెన్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, చాప్‌మన్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు కివీస్‌లో ఉన్నారు. కివీస్ ఇప్పటి వరకు సాధించిన విజయాల్లో వీళ్లు కీలక పాత్ర పోషించారు. బౌలింగ్‌లోనూ కివీస్ బలంగానే ఉంది. ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, సాంట్నర్, ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర తదితరులతో బౌలింగ్ పటిష్టంగా ఉన్న విషయం తెలిసిందే. బౌల్ట్, ఫెర్గూసన్‌లు నిలకడైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. సాంట్నర్ కూడా మెరుగైన ప్రదర్శనతో అలరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా సమష్టిగా రాణించి మరో విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో కివీస్ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News