Sunday, January 19, 2025

అజేయ భారతం.. టీమిండియాకు తొమ్మిదో గెలుపు

- Advertisement -
- Advertisement -

అజేయ భారతం..
టీమిండియాకు తొమ్మిదో గెలుపు
రాహుల్, శ్రేయస్ శతకాలు
నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
బెంగళూరు: ప్రపంచకప్‌లో ఆతిథ్య టీమిండియా వరుసగా తొమ్మిదో విజయం నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 160 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచుల్లోనూ గెలిచి టీమిండియా సరికొత్త రికార్డును సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది.

ఓపెనర్ వెస్లీ (4)ను సిరాజ్ వెనక్కి పంపాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన కొలిన్ అకర్‌మన్‌తో కలిసి మరో ఓపెనర్ మాక్స్ డౌడ్ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ధాటిగా ఆడిన అకర్‌మన్ ఆరు ఫోర్లతో 35 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ వెంటనే డౌడ్ కూడా వెనుదిరిగాడు. డౌడ్ 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు చేశాడు. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ 4 ఫోర్లతో 45 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తేజా నిడమనురు ఆరు సిక్సర్లు, ఒక ఫోర్‌తో వేగంగా 54 పరుగులు సాధించాడు. అయితే ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో నెదర్లాండ్స్‌కు ఓటమి తప్పలేదు.

శుభారంభం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. గిల్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. చెలరేగి ఆడిన శుభ్‌మన్ 32 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోమిత్ 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 61 పరుగులు సాధించాడు. ఇద్దరు తొలి వికెట్‌కు 11.5 ఓవర్లలోనే 100 పరుగులు జోడించారు. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లి ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేసి ఔటయ్యాడు.

కదంతొక్కిన శ్రేయస్, రాహుల్..
ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ తమపై వేసుకున్నారు. ఇద్దరు నెదర్లాండ్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడొట్టేందుకు డచ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 64 బంతుల్లోనే 11 బౌండరీలు, 4 భారీ సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. ఇక మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించిన శ్రేయస్ 94 బంతుల్లో ఐదు సిక్స్‌లు, 10 ఫోర్లతో 128 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 200 పరుగులు జోడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News