Thursday, January 23, 2025

చెలరేగిన కోహ్లీ, జడేజా.. భారత్‌కు భారీ విజయం

- Advertisement -
- Advertisement -

సెంచరీతో రాణించిన కోహ్లీ.. బాల్‌తో చెలరేగిన జడేజా
234 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చిత్తు
కోల్‌కతా : వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ విజయ దుందుబీ కొనసాగుతోంది. వరుసగా 8వ విజయాన్ని అందుకుంది. సౌతాఫ్రికాతో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 234 పరుగుల భారీ తేడాతో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగితే.. బౌలింగ్‌లో జడేజా ఐదు వికెట్లతో సఫారీలను తిప్పేశాడు. దాంతో సౌతాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో భారత్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

కోహ్లీ సెంచరీ.. రాణించిన శ్రేయాస్
టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్‌కు శుభారంభం దక్కింది. రోహిత్ – శుభ్‌మన్ గిల్(23)లు తొలి వికెట్ కు 5.5 ఓవర్లలోనే 62 పరుగులు జతచేశారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన రోహిత్‌ను రబాడా తాను వేసిన తొలి ఓవర్లోనే ఔట్ చేసి భారత్‌కు తొలి షాకిచ్చాడు. కోహ్లీతో కలిసి కొద్దిసేపు ఆడిన గిల్‌ను కేశవ్ మహారాజ్ బౌల్ చేశాడు. 10.3 ఓవర్లలో 93 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను కోహ్లీ-అయ్యర్ ఆదుకున్నారు.

ఈ ఇద్దరూ కుదురుకునేదాకా కాస్త నెమ్మదిగా ఆడినా క్రీజులో సెట్ అయ్యాక సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కోహ్లీ అర్థ సెంచరీ 67 బంతుల్లో పూర్తికాగా శ్రేయస్ 64 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అర్థ సెంచరీ తర్వత జోరు పెంచిన అయ్యర్.. భారీ షాట్లు ఆడాడు. దీంతో భారత స్కోరు పరుగులెత్తింది. మూడో వికెట్ కు 158 బంతుల్లో 134 పరుగులు జోడించారు. అయ్యర్ నిష్క్రమించాక వచ్చిన కెఎల్ రాహుల్(7) మరోసారి విఫలమయ్యాడు. ఆరో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో ఐదు బౌండరీల సాయంతో 22 పరుగులు చేశాడు.

కానీ షంసీ వేసిన 46వ ఓవర్లో ఆఖరి బంతికి రివర్స్ స్వీప్ ఆడబోయి వికెట్ కీపర్ డికాక్ అద్భుత క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి అచీతూచి ఆడుతూ భారత్ స్కోర్ బోర్డును నడిపించాడు. 70 పరుగుల తర్వాత నెమ్మదించిన కోహ్లీ సింగిల్స్ తీస్తూ 49వ ఓవర్లో మూడో బంతికి సింగిల్ తీసిన కోహ్లీ.. సెంచరీ పూర్తిచేసుకున్నాడు. చివర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్ , 3 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులతో భారత్ 326 పరుగులు చేయగలిగింది. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, టబ్రైజ్ షంసీ, ఎయిడెన్ మార్క్మ్ తలో వికెట్ తీసారు.

జడేజా మాయ..
అనంతరం లక్ష్య చేధనకు దిగిన సౌతాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా (5/33) ఐదు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా.. మహమ్మద్ షమీ(2/18), కుల్దీప్ యాదవ్(2/7) రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్(1/11) ఓ వికెట్ దక్కింది. మార్కో జాన్సెన్(14), వాన్ డెర్ డస్సెన్(13), టెంబా బవుమా(11), డేవిడ్ మిల్లర్(11) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఈ మెగా టోర్నీలో సెంచరీల మోత మోగించిన క్వింటన్ డికాక్(5) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు.

సఫారీ భీకర బ్యాటింగ్ లైనప్.. భారత బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది. భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేక సఫారీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓటమెరుగని జట్టుగా నిలిచిన భారత్ ఇప్పటికే సెమీఫైనల్ చేరగా.. రెండు ఓటముల ఎదుర్కొన్న సౌతాఫ్రికా సైతం సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన బర్త్‌డే బాయ్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టీమిండియా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో ఆడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News