ప్రపంచకప్‌లో వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఆతిథ్య టీమిండియా చివరి లీగ్ మ్యాచ్ లో ఆదివారం నెదర్లాండ్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే లీగ్ దశలో 8 విజయాలు సాధించిన భారత్ మరో గెలుపుపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి లీగ్ దశను విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రోహిత్ సేన సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నాడు. ఇటు గిల్ అటు రోహిత్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది.