Sunday, January 19, 2025

ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా..

- Advertisement -
- Advertisement -

ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా..
సమరోత్సాహంతో భారత్, గెలుపు కోసం కివీస్
నేడు ముంబైలో తొలి సెమీస్ పోరు
ముంబై: భారత్ గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంది. బుధవారం ముంబైలో చారిత్రక వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీ ఫైనల్లో ఆతిథ్య భారత్, కిందటి రన్నరప్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో టీమిండియా ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ గెలిచి జోరుమీదుంది. కివీస్ ఐదు విజయాలతో సెమీ బెర్త్‌ను దక్కించుకుంది. కాగా, కిందటి ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఆతిథ్య భారత్ ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే లీగ్ దశలో న్యూజిలాండ్‌ను ఓడించిన టీమిండియా సెమీస్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.

భారత్ ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. గతంలో ఆడిన ఏడు సెమీ ఫైనల్ మ్యాచుల్లో భారత్ మూడింటిలో విజయం సాధించింది. ఈసారి కూడా గెలిచి నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కిందటిసారి తుది పోరుకు అర్హత సాధించిన న్యూజిలాండ్ కూడా ఎలాగైనా విజయం సాధించాలనే లక్షంతో కనిపిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ముంబై మైదానంలో జరుగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్ కోట్లాది మంది క్రికెట్ అభిమానులను కనువిందు చేయడం ఖాయం.

జోరుమీదున్న రోహిత్, గిల్..
సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నాడు. ఈసారి కూడా వీరిద్దరూ జట్టుకు మెరుగైన ఆరంభం అందించాలని భావిస్తున్నారు. ఇద్దరు పామ్‌లో ఉండడం భారత్‌కు కలిసిచ్చే అంశంగా చెప్పాలి. అంతేగాక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా వరల్డ్‌కప్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే 594 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లి జట్టుకు చాలా కీలకంగా మారాడు. కోహ్లి విజృంభిస్తే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు ఖాయం. శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. నెదర్లాండ్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో శ్రేయస్, రాహుల్‌లు సెంచరీలతో చెలరేగిపోయారు. ఈసారి కూడా విజృంభించాలనే పట్టుదలతో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా భారత్ సమతూకంగా ఉంది. షమి, బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజాలతో కూడిన బౌలింగ్ లైనప్ ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను హడలెత్తిస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా బౌలర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

సంచలనాలకు మరోపేరు..
మరోవైపు న్యూజిలాండ్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ చాలా బలంగా ఉంది. డేవొన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కెప్టెన్ విలియమ్సన్, డారిల్ మిఛెల్, చాప్‌మన్, లాథమ్, గ్లెన్ పిలిప్స్ వంటి స్టార్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక మిఛెల్ సాంట్నర్, టిమ్ సౌథి, ట్రెంట్ బౌల్ట్, ఫెర్గూసన్‌లతో బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది. ఇలాంటి స్థితిలో కివీస్‌తో భారత్‌కు గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది.

జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్, రవీంద్ర జడేజా, షమి, బుమ్రా, కుల్దీప్, సిరాజ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ, అశ్విన్, శార్దూల్.

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), కాన్వే, రచిన్, డారిల్ మిచెల్, చాప్‌మన్, ఫిలిప్స్, లాథమ్, సౌథి, సాంట్నర్, ఫెర్గూసన్, బౌల్ట్, ఐష్ సోధి, నీషమ్, జమీసన్, విల్ యంగ్.
హైలైట్స్..
111 ఇరు జట్ల మధ్య జరిగిన వన్డేలు
59 భారత్ సాధించిన విజయాలు
50 కివీస్ సాధించిన విజయాలు
594 ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లి సాధించిన పరుగులు
3 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ సాధించిన విజయాలు
8 భారత్ ఆడనున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌ల సంఖ్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News