కోల్‌కతా: ఈడెన్ గార్డెన్ వేదికగా శనివారం జరిగే పోరులో బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఐదేసి మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌లు ఒక్కో విజయాన్ని మాత్రమే అందుకున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి కాస్తయిన ఓదార్పు దక్కించుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇలాంటి స్థితిలో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ ఆ జట్టుకు సవాల్‌గా తయారైంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. సమష్టిగా రాణిస్తే ఈ మ్యాచ్‌లో సంచలన విజయం సాధించడం ఇరు జట్లకు కష్టమేమీ కాదు. కాగా, నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి మూడు మ్యాచుల్లో విజయం సాధించడం బంగ్లాదేశ్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి.
ఈ మ్యాచ్‌లోనూ గెలిచి రికార్డును మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తోంది. లిటన్ దాస్, తంజీద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, కెప్టెన్ షకిబ్ అల్ హసన్, మెహదీ హసన్, మహ్మదుల్లా, ముష్ఫికుర్ రహీం తదితరులతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక షకిచ్, ముస్తఫిజుర్, షరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, హసన్ మీరాజ్‌లతో బౌలింగ్ విభాగం కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.