Friday, December 20, 2024

World Cup 2023: కివీస్‌కు రెండో గెలుపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో కిందటి రన్నరప్ న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 99 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. నెదర్లాండ్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో కేవలం 223 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి టీమ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు.

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ మాక్స్ డౌడ్ (16) కూడా జట్టును ఆదుకోవడంలో విఫలమయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన కొలిన్ అకర్‌మన్ మాత్రం కీలక ఇన్నింగ్స్‌తో అలరించాడు. కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న అకర్‌మన్ 5 ఫోర్లతో 69 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్ (30), సైబ్రాండ్ (29) పరుగులు సాధించారు. మిగతా వారు విఫలం కావడంతో నెదర్లాండ్స్‌కు ఘోర పరాజయం తప్పలేదు. ప్రత్యర్థి జట్టులో బౌలర్లలో సాంట్నర్ ఐదు, మాట్ హెన్రీ మూడు వికెట్లు తీశారు.

యంగ్, రవీంద్ర మెరుపులు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌కు ఓపెనర్లు డెవోన్ కాన్వే, విల్ యంగ్‌లు శుభారంభం చేశారు. కాన్వే ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 32 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్ రవీంద్రతో కలిసి యంగ్ మరో కీలక పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించిన యంగ్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 70 పరుగులు సాధించాడు. రచిన్ 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51 పరుగులు చేశాడు. డారిల్ మిఛెల్ (48), కెప్టెన్ లాథమ్ (53), సాంట్నర్ 36 (నాటౌట్) కూడా ధాటిగా ఆడడంతో కివీస్ స్కోరు 322 పరుగులకు చేరింది. ఆల్‌రౌండ్‌షోతో కివీస్‌ను గెలిపించిన సాంట్నర్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News