Sunday, January 19, 2025

నేటి నుంచి వన్డే వరల్డ్‌కప్.. న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ ఢీ

- Advertisement -
- Advertisement -

మెగా సమరానికి సర్వం సిద్ధం
నేటి నుంచి వన్డే వరల్డ్‌కప్
తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ ఢీ
అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్ రానే వచ్చింది. భారత్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నమెంట్‌కు గురువారం తెరలేవనుంది. నవంబర్ 19 వరకు జరిగే ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌తో సహా మొత్తం పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్న్న్రరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే పోరుతో వరల్డ్‌కప్ ఆరంభమవుతోంది. మాజీ ఛాంపియన్‌లు భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఈ మెగా టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆదివారం చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్‌ల మధ్య అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా పోరు జరుగనుంది. వరల్డ్‌కప్‌కే ఈ మ్యాచ్ హాట్ ఫేవరెట్‌గా మారింది. దాయాదిల మధ్య జరిగే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదిలావుంటే రెండు సార్లు ప్రపంచ విజేతగా ఉన్న వెస్టిండీస్ ఈసారి బరిలోకి దిగడం లేదు. వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించడంలో విండీస్ విఫలమైంది. భారత్‌తో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా జట్లు ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాయి. ప్రతి జట్టు లీగ్ దశలో ప్రత్యర్థి తలపడనుంది. ఈ దశలో మొత్తం 45 మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ స్టేజీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీ ఫైనల్ నవంబర్ 15న ముంబైలో, రెండో సెమీ ఫైనల్ 16న కోల్‌కతాలో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది, నాకౌట్ దశలో మూడు మ్యాచ్‌లు ఉంటాయి. ఈసారి అహ్మదాబాద్, హైదరాబాద్, ధర్మశాల, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, పుణె, ముంబై, కోల్‌కతా వేదికలుగా వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అహ్మదాబాద్‌లో ఆరంభ మ్యాచ్‌తో పాటు భారత్‌పాకిస్థాన్, ఫైనల్ పోరు జరుగనుంది. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వరల్డ్‌కప్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో పాకిస్థాన్ తలపడనుంది. న్యూజిలాండ్‌నెదర్లాండ్స్, పాకిస్థాన్‌శ్రీలంక మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

కివీస్‌తో ఇంగ్లండ్ తొలి పోరు
వరల్డ్‌కప్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో కిందటి రన్నరప్ న్యూజిలాండ్‌తో ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లండ్ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. కొంతకాలంగా వన్డేల్లో ఇంగ్లండ్ వరుస విజయాలతో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈసారి వరల్డ్‌కప్ ఫేవరెట్లలో ఇంగ్లండ్‌ను కూడా పరిగణిస్తున్నారు. కివీస్ కూడా నిలకడైన ప్రదర్శనతో అలరిస్తోంది. వార్మప్ మ్యాచుల్లో కివీస్ సత్తా చాటింది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఇంగ్లండ్ టీమ్‌కు జోస్ బట్లర్, కివీస్ టీమ్‌కు టామ్ లాథమ్ సారథ్యం వహిస్తున్నారు. జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జోరూట్, బెన్ స్టోక్స్, లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, వోక్స్, సామ్ కరన్, ఆదిల్ రషీద్ తదితరులతో ఇంగ్లండ్ బలంగా ఉంది. డేవొన్ కాన్వే, యంగ్, డారిల్ మిఛెల్, చాప్‌మన్, టామ్ లాథమ్, ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, బౌల్ట్, టిమ్ సౌథి, ఫెర్గూసన్ తదితరులతో కివీస్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News