బెంగళూరు: వరుస విజయాలతో టోర్నమెంట్‌ను ఆరంభించిన కిందటి రన్నరప్ న్యూజిలాండ్ ఆ తర్వాత పేలవమైన ఆటతో వరుస ఓటములను చవిచూసింది. చివరి నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలై సెమీ ఫైనల్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఈ క్రమంలో గురువారం బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగే మ్యాచ్ న్యూజిలాండ్‌కు చావో రేవోగా మారింది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే కివీస్‌కు సెమీ ఫైనల్ అవకాశాలు ఉంటాయి. సెమీస్ స్థానం కోసం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్ల నుంచి కివీస్‌కు గట్టి నెలకొంది.
భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం మూడు జట్ల మధ్య పోటీ ఏర్పడింది. అయితే మెరుగైన రన్‌రేట్‌ను కలిగి ఉండడం న్యూజిలాండ్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. కానీ, మ్యాచ్ జరిగే రోజు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది న్యూజిలాండ్ టీమ్‌ను కలవరానికి గురిచేస్తోంది.
ఒకవేళ మ్యాచ్ రద్దయితే కివీస్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారుతాయి. అప్పుడూ పాకిస్థాన్, అఫ్గాన్‌లకు సెమీస్ చేరే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి స్థితిలో కివీస్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు శ్రీలంక ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఓడిన లంకకు జరిగే నష్టమేమీ ఉండదు. కానీ కివీస్‌కు మాత్రం కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో 401 పరుగుల భారీ స్కోరు సాధించిన న్యూజిలాండ్‌కు ఓటమి తప్పలేదు. ఈ పరిస్థితుల్లో శ్రీలంకతో జరిగే మ్యాచ్ కివీస్‌కు సవాల్‌గా తయారైంది.