Sunday, January 19, 2025

లంక-కివీస్ మ్యాచ్ కష్టమే?.. వర్షం కోసం పాక్ ఎదురుచూపులు!

- Advertisement -
- Advertisement -

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగే శ్రీలంక- న్యూజీలాండ్ మ్యాచ్ కి వర్షం బెడద తప్పకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బెంగళూరులో గత నాలుగైదు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. గురువారం కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. చిన్నస్వామి స్టేడియంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చక్కటి డ్రైనేజీ ఏర్పాట్లు ఉన్నాయి.

తేలికపాటి వర్షం కురిస్తే అరగంటలోగా నీటిని బయటకు పంపించి, స్టేడియాన్ని ఆటకు సిద్ధం చేసేయొచ్చు. కానీ భారీ వర్షం కురిస్తేనే పరిస్థితి జటిలంగా మారుతుంది. వాతావరణ శాఖ నవంబర్ 10 వరకూ ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది. రోజుకు 64 మి.మీ నుంచి 115 మి.మీ వర్షపాతం కురిసే అవకాశం ఉంటే ఎల్లో ఎలర్ట్ జారీ చేస్తారు.  ఈ నేపథ్యంలో భారీ వర్షం కురిసి, మ్యాచ్  రద్దయితే పరిస్థితి ఏమిటి అనే విషయమై ఇప్పుడు అభిమానుల మధ్య ఆసక్తికరమై చర్చ నడుస్తోంది.

లంక-న్యూజీలాండ్ మ్యాచ్ రద్దయితే దాని ప్రభావం పాక్, ఆప్ఘనిస్తాన్ లపై పడుతుంది. న్యూజీలాండ్-శ్రీలంక మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరొక పాయింట్ లభిస్తాయి. ప్రస్తుతానికి ఎనిమిది పాయింట్లతో ఉన్నన్యూజీలాండ్ తొమ్మిది పాయింట్లకు చేరుకుంటుంది. నాలుగు పాయింట్లతో ఉన్న శ్రీలంక ఐదు పాయింట్లకు చేరుకుంటుంది. శ్రీలంక ఎలాగూ సెమీస్ కు చేరే అవకాశంలేదు కానీ, న్యూజీలాండ్ పరిస్థితి అయోమయంలో పడుతుంది. ఆ మరునాడు జరిగే పాకిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్ లో పాక్ గెలిస్తే, పది పాయింట్లతో సెమీస్ కు చేరుకుంటుంది. తొమ్మిది పాయింట్లు మాత్రమే సాధించిన న్యూజీలాండ్ పని ముగిసిపోయినట్టే.

ఆప్గనిస్తాన్ కు కూడా సెమీ ఫైనల్ చేరే అవకాశం లేకపోలేదు. సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ లోఆప్ఘనిస్తాన్ గెలిస్తే, పాక్, ఆప్ఘన్ లలో ఏ జట్టు సెమీస్ చేరుతుందనే విషయాన్ని నెట్ రన్ రేటు తేలుస్తుంది. ఎందుకంటే, ఇరు జట్లూ తమ చివరి లీగ్ పోటీల్లో గెలిస్తే, చెరో పది పాయింట్లూ లభిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News