Sunday, January 19, 2025

ముగింపు వేడుకలకు భారీ ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

ప్రత్యేక ఆకర్షణగా వాయుసేన విన్యాసాలు
అహ్మదాబాద్: ప్రపంచకప్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బిసిసిఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం ఇక్కడి నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య తుది పోరు జరుగనున్న విషయం తెలిసిందే. నెల రోజులకు పైగా క్రికెట్ అభిమానులను కనువిందు చేసి మెగా టోర్నమెంట్‌కు ఆదివారంతో తెరపడనుంది. ఈ నేపథ్యంలో ముగింపోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బిసిసిఐ పెద్దలు నిర్ణయించారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించనున్న వాయు సేన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.

వాయుసేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం ఈ విన్యాసాలు నిర్వహించనుంది. ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి పది నిమిషాల ముందు ఈ వేడుక జరుగనుంది. అంతేగా పాప్ సింగ్ దువా లిపా కూడా ముగింపు వేడుకల్లో ఉర్రుతాలుగించనున్నారు. దువా లిపతో ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. హాలీవుడ్, అల్బేనియన్ పాప్ సింగర్ అయిన లిపాతో ఇటీవల నిర్వహించిన ఆస్క్ దువా వర్చువల్ సెషన్‌లో భారత క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, రాహుల్, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు పాల్గొన్నారు. అయితే లిపాతో నిర్వహించే కార్యక్రమంపై బిసిసిఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

ఎక్కడ చూసిన క్రికెట్ సందడే..

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ పోరుకు దూసుకెళ్లాయి. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకోవడంతో దేశంలో పండగ వాతావరణం నెలకొంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో క్రికెట్ సందడి కనిపిస్తోంది. పలు నగరాల్లో ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఇప్పటికే హోటళ్లలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి ప్రత్యేక అతిథులు వస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇక ఐసిసి సభ్యత్వం కలిగిన దేశాల క్రికెట్ ప్రముఖులను, రాజకీయ ప్రతినిధులను ఫైనల్ మ్యాచ్ కోసం బిసిసిఐ ఆహ్వానించింది. అంతేగాక బాలీవుడ్ స్టార్లు కూడా ఫైనల్ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారారు. పలువురు స్టార్లు మ్యాచ్‌ను చూసేందుకు అహ్మదాబాద్ రానున్నారు. ఇదిలావుంటే భారత్ ఫైనల్‌కు చేరడంతో క్రికెట్ ప్రేమికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈసారి భారత్ ట్రోఫీ గెలవాలని కోట్లాది మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఫైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో తిలకించేందుకు ప్రధాన కూడళ్లలో భారీ టివిలను ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News