భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ ఛాంపియన్‌షిప్‌లో అగ్రశ్రేణి జట్లు నెదర్లాండ్స్, జర్మనీలు శుభారంభం చేశాయి. ఇతర మ్యాచుల్లో బెల్జియం, న్యూజిలాండ్ జట్లు కూడా విజయం సాధించాయి. శనివారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 40 తేడాతో ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన డచ్ టీమ్ ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. 19వ నిమిషంలో వాన్ డామ్ అద్భుత ఫీల్డ్ గోల్డ్‌తో జట్టుకు పైచేయి సాధించి పెట్టాడు. 23వ నిమిషంలో జాన్‌సెన్ పెనాల్టీ షూటౌట్ ద్వారా గోల్ నమోదు చేశాడు.
ప్రథమార్ధంలో నెదర్లాండ్స్ 20 ఆధిక్యంలో నిలిచింది. ఇక ద్వితీయార్ధం 46వ నిమిషంలో బీన్స్ ట్యూన్, 59వ నిమిషంలో క్రూన్ జోరిట్ గోల్స్ సాధించారు. దీంతో నెదర్లాండ్స్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో జర్మనీ 30 తేడాతో జపాన్‌ను ఓడించింది. గ్రామ్‌బుస్చ్, క్రిస్టోఫర్, ప్రిన్జ్ థీస్‌లు తలో గోల్ సాధించారు. ఇక మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం 50 తేడాతో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. ప్రథమార్ధంలో బెల్జియంకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి హాఫ్‌లో బెల్జియం 10 ఆధిక్యంలో నిలిచింది. అయితే సెకండ్ హాఫ్‌లో ఏకంగా నాలుగు గోల్స్‌ను నమోదు చేసింది. మరో మ్యాచ్‌లో 31 గోల్స్ తేడాతో చీలీని ఓడించింది.