హాకీ ఆటగాళ్లకు ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ బంపర్ ఆఫర్
భువనేశ్వర్: సొంత గడ్డపై జరుగనున్న పురుషుల హాకీ ప్రపంచకప్‌లో ట్రోఫీ సాధిస్తే హాకీ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి కోటు రూపాయల చొప్పున నగదు బహుమతిని ఇందిస్తానని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఒడిశా వేదికగా జనవరి 13 నుంచి పురుషుల హాకీ ప్రపంచకప్ టోర్నమెంట్ జరుగనుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో ప్రపంచ వ్యాప్తంగా 16 దేశాలకు చెందిన జట్లు పోటీ పడనున్నాయి. ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కూలా నగరాలు ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా జనవరి 29న జరిగే ఫైనల్‌తో ప్రపంచకప్‌కు తెరపడుతోంది.
కాగా, ప్రపంచకప్‌లో పాల్గొంటున్న భారత హాకీ జట్టుకు ఒడిశా ప్రభుత్వం ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఇక వరల్డ్‌కప్ కోసం ఇప్పటికే 18 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేశారు. ఇదిలావుంటే గురువారం భారత హాకీ జట్టు సభ్యులు ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించిన ఒడిశా సిఎం క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. సొంత గడ్డపై జరిగే వరల్డ్‌కప్‌లో సర్వం ఒడ్డి పోరాడాలని సూచించారు. ట్రోఫీని సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింప చేయాలని కోరారు. వరల్డ్‌కప్ ట్రోఫీ సాధిస్తే జట్టులోని ప్రతి ఆటగాడికి కోటి రూపాయల చొప్పున నగదు బహుమతిని అందిస్తామని సిఎం వెల్లడించారు.