బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐక్యరాజ్య సమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002 సంవత్సరంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జూన్ 12 గా నిర్ణయించింది. అప్పటి నుండి ప్రతి దేశం బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ప్రతి సంవత్సరం ఈ తేదీ నాడు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కొన్ని దేశాలలో 5 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిని, ఇంకొన్ని దేశాలలో 5 నుండి 18 సంత్సరాల మధ్యలో ఉన్న వారిని బాల కార్మికులుగా గుర్తిస్తారు. బాల్యాన్ని నాశనం చేసే రీతిలో బాలల శారీరక, మానసిక అభివృద్ధికి ఆటంకమై, వారికి కనీస అక్షరాస్యతను, వినోదాన్ని కూడా పొందే అవకాశాన్ని ఇవ్వని స్థితిని బాల కార్మిక వ్యవస్థగా చెప్పొచ్చు. ఈ వ్యవస్థలో ఉండే వారిని బాల కార్మికులుగా పిలుస్తారు. శ్రమకు బలైపోతున్న వీరి జీవితాలు మనం సాధించిన అభివృద్ధిని ప్రశ్నిస్తున్నాయి.
Also Read: రాజ్యాంగం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యం
అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ – 19కి ముందు 160 మిలియన్ల మంది ఉన్నారు. ఇందులో 63 మిలియన్ల మంది బాలికలు, 97 మిలియన్ల మంది బాలురు ఉన్నారు. ఇందులో ఎక్కువగా 70 శాతం వ్యవసాయ రంగంలోనూ, 20 శాతం సేవారంగంలోను, 10 శాతం ఇతర పరిశ్రమలలో పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో బాల కార్మికుల ప్రాబల్యం పట్టణ ప్రాంతాల్లో కంటే మూడు రెట్లు ఎక్కువ. అత్యధకంగా సబ్‌సహారాన్ ఆఫ్రికా ప్రాంతంలో 86.6 మిలియన్ల మంది ఉన్నారు. కోవిడ్ 19 వలన అదనపు ఆర్థిక అవసరాలు, పాఠశాలల మూసివేతలు, పెద్దలలో ఉద్యోగం కోల్పోవడం, ఆదాయ నష్టాలు, తల్లిదండ్రుల్లో ఒక్కరుగాని లేదా ఇద్దరూ మరణించడం వలన 2022 సంవత్సరం అంతానికి మరో 8.9 మిలియన్ల మంది కొత్తగా బాల కార్మికులు పెరుగుతారని అంచానా వేసింది. వీరిపై దృష్టి పెట్టకపోతే వీరి సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపింది. బాల కార్మికులు ప్రపం చంలోని అంత్యంత పేద దేశాలలో నలుగురిలో ఒకరు ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ బాల కార్మికుల సమస్య తొలినాళ్లలో అంటే 16, 17 వ శతాబ్దాలలో తమ పిల్లలను విక్రయించే వారు. కొనుగోలు చేసిన వారు తమ ఇళ్లల్లో పనులు చేయించుకునేవారు. పారిశ్రామిక విప్లవం మొదలైన తరువాత బాల కార్మికులు ఎక్కువయ్యారు. కారణం తక్కువ వేతనంతో ఎక్కువ పనిని పిల్లలతో పరిశ్రమ యజమానులు చేయించుకునేవారు.ఇప్పుడు ఎక్కువగా వ్యవసాయ రంగం, గృహ సంబంధ పనులు, బాణా సంచా తయారీ లోనూ, వస్త్రాలు తయారు చేసే రంగంలోనూ, గనులు, మైనింగ్, బొమ్మల తయారీ, గొడుగులు తయారీలోనూ, వార్తా పత్రికలు ఇంటింటికీ అందించడం లోనూ, బాల కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఇంకా వ్యవసాయ, పాడి, మత్స్య, అటవీ రంగాలలో, రిటైల్ గా వస్తువులు అమ్మడంలోనూ, రెస్టారెంట్ లలోనూ, వస్తువులు లోడింగ్, చెత్తను తీయడం, బూట్లు పాలిష్ చేయడం, అసంఘిటిత రంగాలలోనూ, కొన్నిర కాల యంత్రాలు ఆపరేటింగ్ చేయడంలో, ఉప్పు పరిశ్రమ, అద్దాల తయారీ పరిశ్రమలోనూ, ఎక్కువ మంది బాల కార్మికులు ఉన్నారు. తరువాత కాలంలో అన్ని రంగాలలో బాల కార్మికులు పెరుగుతూ వచ్చారు. కొంత మంది పిల్లలతోవారి అభిప్రాయాలతో సంబంధం లేకుండా వేశ్యా వృత్తులలోకి దించుతున్నారు.
బాల కార్మికులుగా మారడానికి ప్రధాన కారణం కుటుంబ పేదరికం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇతర కారణాలు.. కుటుంబంలో ఎక్కువమంది వ్యక్తులు ఉండడం, తక్కువ మంది సంపాదనలో ఉండడం. పెద్ద కుటుంబాలు, చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడం. ఏదో సమస్యలతో రోడ్ల మీద పిల్లలను వదిలి వేయడం. ఏదో సందర్భంలో తప్పిపోయిన పిల్లలు. తల్లిదండ్రుల నిరక్షరాస్యత, తరచూ పిల్లలతో పని కోసం వలసలు వెళ్ళడం, పాఠశాలలు దూరంగా ఉండడం. వ్యవసాయ రంగంలో పెద్దలకు సాయంగా పిల్లలను తోడుగా ఉంచుకోవడం మొదలైన కారణాలు చెప్పవచ్చు.
ఈ విధంగా మనం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు వున్న వారికి కొన్ని హక్కులు ఉన్నాయి. వీటిని వీరికి అందజేయడంలో కొంత వరకు విఫలం అయినట్లే. హక్కులలో కొన్ని చూసినట్లయితే, అన్ని పరిస్థితులలో లింగ, జాతి, మతం, కులం, హోదాలతో సంబంధం లేకుండా అందరికీ విద్యను అందజేయాలి. ఈ విషయంలో అన్ని దేశాలు అందరికీ విద్యావకాశాలు కల్పించుతున్నాయి. ఇంకా పిల్లలకు వారికి నచ్చిన రంగంలో చదువుకునే హక్కు ఉంది. జీవించే హక్కు, ఆర్థిక సామాజిక, పర్యావరణ, అభివృద్ధి హక్కులు ఉన్నాయి. ఇక మన దేశంలో తీసుకుంటే భారత్ రాజ్యాంగం బాలలకు కొన్ని హక్కులు కల్పించింది. ఆర్టికల్ 14లో సమానత్వం హక్కు, ఆర్టికల్ 15లో వివక్షతకు వ్యతరేకంగా ఉండే హక్కు, ఆర్టికల్ 21 లో వ్యక్తిగత జీవించే హక్కు, ఆర్టికల్ 21 (ఎ)లో ఆరు సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్యను పొందే హక్కు, ఆర్టికల్ 23లో శ్రమ దోపిడీ నుండి రక్షించబడే హక్కు , ఆర్టికల్ 24లో 14 వయసు లోపు గల చిన్న పిల్లల చేత పరిశ్రమలోనూ, గనులలోనూ, ఇతర ప్రమాదభరిత ఉత్పత్తి ప్రక్రియ లలోను పని చేయించరాదు, ఆర్టికల్ 45లో పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం వంటి హక్కులు ఉన్నాయి. అలాగే బాల కార్మిక వ్యతిరేక చట్టం 1986 లో మన దేశం రూపొందించింది.
బాల కార్మిక పరిణామాలు
బాల కార్మికులు ఎక్కువగా ఉండడం వలన ఆయా దేశాల్లో వీరు విద్యకు నోచుకుపోవడం వలన పేదరికంలోనికి నెట్టబడతారు. సరైన పోషకాహారం లేకపోవడం వలన శారీరంగానూ, మానసికంగానూ, మేధోపరంగానూ, అభివృద్ధి చెందలేరు. త్వరగా అలసిపోవడం వలన అనేక వ్యాధులు గురవుతారు. మారిన కాలానికి అనుగుణంగా విద్య నేర్చకపోవడం వలన పని చేసే రంగంలో నాణ్యతను కోల్పోయే కారణంగా పని చేసే రంగం నుండి నెట్టబడి నిరుద్యోగులగా తయారవుతారు. అప్పుడు వీరికి ఉపాధి దొరకక దొంగ తనానికి, స్మగ్లర్లుగా, గూండాలుగా, మాఫియా ముఠా సభ్యులుగా, తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాల కార్మిక వ్యవస్థను సరైన సమయంలో నిషేధించాలి. ఆయా దేశాలలో వారి చట్టాల ప్రకారం ఉల్లంఘించే వ్యక్తుల మీద, సంస్థల మీద చర్యలు తీసుకోవాలి. వీళ్లకు ప్రత్యేక పాఠశాలలు తెరవాలి. సరైన పోషకాహారం అందేటట్లు చూడాలి. మానసిక వైద్యులుచే కౌన్సిలింగ్ ఇప్పించాలి. కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఈ పనిని చెయ్యలేవు. స్వచ్ఛంద సంస్థలు తల్లిదండ్రులకు బాలకార్మికులు వలన కలిగే ఇబ్బందులను తెలియజేయాలి. ఈ అనాగరిక బాలకార్మిక వ్యవస్థను నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి.
డి జె మోహన రావు
9440485824