Monday, December 23, 2024

ప్రపంచ వృద్ధి

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాల నివేదిక 2024ను 04 జనవరి 24న ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ ఆర్థిక వృద్ధి 2023లో అంచనా వేసిన 2.7 శాతం నుండి 2024లో 2.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేయబడింది. ఇది మహమ్మారి ముందు వృద్ధి రేటు 3.0 శాతం కంటే తక్కువగా ఉంది. ఈ తాజా సూచన 2023లో అంచనాలకు మించి ప్రపంచ ఆర్థిక పని తీరును చూపుతున్నది. అయితే గత సంవత్సరం ఊహించిన దాని కంటే బలమైన జిడి పి వృద్ధి స్వల్పకాలిక నష్టాలు, నిర్మాణాత్మక దుర్బలత్వాలను కప్పివేసింది. నిరంతరంగా అధిక వడ్డీ రేట్లు, సంఘర్షణలు మరింత పెరగడం, అంతర్జాతీయ వాణిజ్యం మందగించడం, పెరుగుతున్న వాతావరణ విపత్తులు ప్రపంచ వృద్ధికి గణనీయమైన సవాళ్లను కలిగిస్తాయి.

రుణాలతో సతమతమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుదీర్ఘమైన, కఠినమైన రుణ పరిస్థితులు, అధిక రుణ ఖర్చుల అవకాశాలు బలమైన ఎదురు గాలిని అందిస్తాయి. అయితే వృద్ధిని పునరుజ్జీవింపజేయడానికి, వాతావరణ మార్పులతో పోరాడటానికి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా పురోగతిని వేగవంతం చేయడానికి మరిన్ని పెట్టుబడులు అవసరం. 2024 ప్రపంచ దేశాలు ఈ ఊబిలోంచి బయటపడే సంవత్సరం కావాలంటే సాహసోపేతమైన పెట్టుబడులను అందచేయడం ద్వారా స్థిరమైన అభివృద్ధి, వాతావరణ చర్యలను నడిపించవచ్చు. ఈ చర్యల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది. స్థిరమైన అభివృద్ధి, వాతావరణ చర్యలో పెట్టుబడుల కోసం సరసమైన దీర్ఘకాలిక ఫైనాన్సింగ్‌లో సంవత్సరానికి కనీసం 500 బిలియన్ డాలర్లు అవసరమవుతుంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో తగ్గిన వృద్ధి అనేక పెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ముఖ్యంగా అమెరికా అధిక వడ్డీ రేట్లు, వినియోగదారుల వ్యయం మందగించడం, బలహీనమైన కార్మిక మార్కెట్ల కారణంగా 2024లో క్షీణించవచ్చని అంచనా వేయబడింది. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్వల్పకాలిక వృద్ధి అవకాశాలు ముఖ్యంగా తూర్పు ఆసియా, పశ్చిమాసియా , లాటిన్ అమెరికా, కరేబియన్లలో కఠినమైన ఆర్థిక పరిస్థితులు, కుదించే ఆర్థిక స్థలం, మందగించిన బాహ్య డిమాండ్ కారణంగా కూడా దిగజారుతున్నాయి.

తక్కువ- ఆదాయ, హాని కలిగించే ఆర్థిక వ్యవస్థలు పెరుగుతున్న బ్యాలెన్స్- ఆఫ్- చెల్లింపుల ఒత్తిడి, రుణ స్థిరత్వ ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక అవకాశాలు, ప్రత్యేకించి భారీ రుణ భారాలు, అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న వాతావరణ సంబంధిత దుర్బలత్వాలు అణగదొక్కడానికి కారకాలవుతాయు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. 2023లో 5.7% నుండి 2024లో 3.9 శాతానికి తగ్గుతుందని అంచనా వేయబడింది. అయితే అనేక దేశాల్లో ధరల ఒత్తిళ్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, భౌగోళిక రాజకీయాలు మరింతగా పెరుగుతాయి. వివాదాల నష్టాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణాలు కావచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నాలుగింట ఒక వంతులో వార్షిక ద్రవ్యోల్బణం 2024లో 10 శాతానికి మించి ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది.

జనవరి 2021 నుండి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో వినియోగదారుల ధరలు క్యూములేటివ్గా 21.1 శాతం పెరిగాయి. కోవిడ్- 19 పునరుద్ధరణ తర్వాత సాధించిన ఆర్థిక లాభాలు గణనీయంగా తగ్గాయి. సరఫరా వైపు అంతరాయాలు, సంఘర్షణలు, విపరీతమైన వాతావరణ సంఘటనల మధ్య, అనేక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో స్థానిక ఆహార ధరల ద్రవ్యోల్బణం అధికంగానే ఉంది. ఇది పేద కుటుంబాలను అసమానంగా ప్రభావితం చేసింది. నిరంతర అధిక ద్రవ్యోల్బణం పేదరిక నిర్మూలనలో పురోగతిని మరింత వెనుకకు నెట్టివేసింది. ముఖ్యంగా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ సహకారం, బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడం, అభివృద్ధి ఫైనాన్స్‌ను సంస్కరించడం, రుణ సవాళ్లను పరిష్కరించడం, స్థిరమైన, సమ్మిళిత వృద్ధిమార్గంలో వేగవంతం చేయడంలో సహాయపడడానికి వాతావరణ ఫైనాన్సింగ్‌ను పెంచడం చాలా అవసరం.

నివేదిక ప్రకారం ప్రపంచ కార్మిక మార్కెట్లు మహమ్మారి సంక్షోభం నుండి అసమాన పునరుద్ధరణను చూశాయి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో వృద్ధి మందగించినప్పటికీ కార్మిక మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. అయినప్పటికీ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో ముఖ్యంగా పశ్చిమ ఆసియా, ఆఫ్రికాలో నిరుద్యోగిత రేటుతో సహా కీలక ఉపాధి సూచికలు ఇంకా మహమ్మారి పూర్వస్థాయికి తిరిగి రాలేదు. ప్రపంచ లింగ ఉపాధి అంతరం ఎక్కువగా ఉంది. లింగ వేతన అంతరాలు కొనసాగడమే కాకుండా కొన్ని వృత్తులలో కూడా విస్తరించాయి.

డి జె మోహన రావు
9440485824

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News